ఫ్రాన్స్‌ సంఘటన మరువక ముందే దక్షిణాఫ్రికాలో పోలీసుల దుశ్చర్య

– కారు నుండి లాగి మరీ వ్యక్తులపై పిడిగుద్దులు
– బయటకు వచ్చిన వీడియోపై ప్రజల ఆగ్రహం
కేప్‌టౌన్‌ : కారును ఆపనందుకు టీనేజర్‌ను కాల్చి చంపిన ఫ్రాన్స్‌ పోలీసుల దుశ్చర్యను, అక్కడి ప్రజల ఆగ్రహావేశాలను ఇంకా మరువక ముందే దక్షిణాఫ్రికాలో కూడా అటువంటి ఘటనే చోటు చేసుకుంది. సివిల్‌ దుస్తుల్లో వచ్చిన సాయుధులైన పోలీసు అధికారులు కారు నుంచి ఓ వ్యక్తిని బయటకు లాగి, ఆ వ్యక్తి తలపై, శరీరంపై పిడిగుద్దులు గుద్దుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. తన్నులు తిన్న ఆ వ్యక్తి వెల్లకిలా, చలనరహితంగా పడివున్నట్టు కనిపిస్తోంది. మరో వ్యక్తిపై కూడా పోలీసు అధికారులు చేయి చేసుకోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. పోలీసులు తంతుంటే తలపై చేతులు అడ్డు పెట్టుకుని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన దక్షిణాఫ్రికా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కిరాతకంగా వ్యవహరించడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు వెలిబుచ్చారు. దక్షిణాఫ్రికా డిప్యూటీ అధ్యక్షుడు పాల్‌ మషటిలె భద్రతా బృందానికి చెందినవారే ఆ పోలీసు అధికారులని, ఈ ఘటన జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిందని ఆయన కార్యాలయం మంగళవారం తెలిపింది. దక్షిణాఫ్రికాలోని పోలీసు రక్షణ దళాన్ని ‘బ్లూ లైట్‌ బ్రిగేడ్‌’గా పిలుస్తారు. అనవసరంగా బల ప్రయోగానికి దిగుతారనే అప్రదిష్ట వారిపై వుంది. అనవసర బల ప్రయోగాన్ని ముఖ్యంగా నిరాయుధులైన పౌరులపై బల ప్రదర్శనను ఉపాధ్యక్షుడు తీవ్రంగా అసహ్యించుకుంటారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధం లేని వ్యక్తి మరో కారులో నుండి ఈ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ సంఘటన జరిగిన వెంటనే ఆ పోలీసు అధికారులు రెండు నల్ల కారుల్లో అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ పక్కనే రోడ్డుపై మరో వ్యక్తి పడివుండడం కూడా కనిపిస్తోంది. అయితే ఆ వ్యక్తిని కూడా తన్నారా లేదా అనేది తెలియడం లేదు. ఈ సంఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో జాతీయ పోలీసు ప్రతినిధి బ్రిగెడియర్‌ అథ్లెండా మాథె ఒక ప్రకటన చేస్తూ, సంబంధిత పోలీసు అధికారులను గుర్తించి, వారిపై అంతర్గత విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనలోని బాధితులను కూడా పోలీసులు గుర్తించారని చెప్పారు.