మణిపూర్‌లో తాజా హింసాకాండ పోలీస్‌ అధికారి మృతి

Latest violence in Manipur Police officer diedఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండకు ముగింపు కనుచూపు మేర కనిపించడం లేదు. తాజాగా జరిగిన హింసాకాండలో ఒక పోలీసు అధికారి మృతి చెందారు. భారత్‌-మయన్మార్‌ సరిహద్దు పట్టణం మోరేలో ఒక పాఠశాల మైదానాన్ని శుభ్రపరిచే పనిని పర్యవేక్షిస్తూ ఉండగా.. సబ్‌-డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (ఎస్‌డిపిఒ) చింగ్తం ఆనంద్‌కుమార్‌పై కాల్పులు జరిపారు. దీంతో ఆనంద్‌ కుమార్‌ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ మరణించారు. రాష్ట్ర పోలీసులు, సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా హెలిప్యాడ్‌ నిర్మాణం కోసం పాఠశాల మైదానాన్ని శుభ్రం చేస్తుండగా ఈ దారుణం జరిగిందని అధికారులు చెప్పారు. మోరేలో భారీగా మోహరించిన భద్రతా సిబ్బందిని ఉపసంహ రించాలని కోరుతూ కొన్ని రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా, ఈ ఘటనపై మణిపూర్‌ క్యాబినెట్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఎస్‌డీపీఓపై కాల్పులు జరిపిన సాయుధులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ తెలిపారు. అలాగే మృతి చెందిన పోలీసు అధికారి కుటుంబానికి రూ 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. నిందితుల్ని పట్టుకునేందుకు మోరే, పరిసర ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్‌ ప్రారంభించాలని బలగాలను ఆదేశించింది. మోరేకు అదనపు బలగాలను తరలించాలని కూడా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.