– వారి తీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నది
– అదుపులోకి తీసుకున్న తమవారిని విడుదల చేయాలి
– హల్ద్వానీలో ముస్లింల ఆందోళన
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో పోలీసుల వ్యవహార శైలిపై స్థానిక ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అణచివేత తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని చెప్తున్నారు. ఈ నెల 8న హల్ద్వానీలో స్థానిక అధికార యంత్రాంగం ఒక మసీదు, మదర్సా కూల్చివేసిన ఘటన.. అక్కడ హింసాత్మక పరిస్థి తులకు కారణమైన విషయం విదితమే. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు తమను ఆందోళనకు గురి చేసిందని ముస్లింలు చెప్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతున్నదని కొందరు ఆరోపిస్తున్నారు.కూల్చివేత తర్వాత ఫిబ్రవరి 8న స్థానిక ప్రజలు, పోలీసులు ఘర్షణ పడిన బన్‌భూల్‌పురా నివాసితులు మాట్లాడుతూ.. పోలీసు అధికారులు తమ ఇండ్లలోకి చొరబడి, మహిళలతో సహా కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. ఆస్తులను ధ్వంసం చేసి, అనేక మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ”పోలీసు అధికారులు మా ఇంట్లోకి చొరబడ్డారు. వారు మా వస్తువులను చిందరవందర చేశారు. నా భర్తపై దాడి చేశారు. మమ్మల్ని కూడా నెట్టారు. వారు అతనిని తీసుకెళ్లారు. అతను ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో మాకు తెలియదు” అని స్థానిక పాఠశాలలో వంట చేసే షామా (38) అన్నారు. షామా భర్త నయీమ్(45) హల్ద్వానీలోని నిర్మాణ స్థలాలకు ఇసుకను రవాణా చేసే రోజువారీ కూలీ.
”నేను నా భర్తను కలవాలనుకుంటున్నాను. పోలీసు అధికారులు నా భర్తను తీసుకెళ్లారు. ఆయన లేకుంటే నేను చనిపోతాను” అని 22 ఏండ్ల మెహ్రీన్ చెప్పింది. ఆమె భర్త ఆరిఫ్(25)ను నలుగురు పోలీసు అధికారులు తీసుకెళ్లారని తెలిపింది. మెహ్రీన్, ఆరీఫ్‌లకు ఏడు నెలల క్రితమే వివాహమైంది.
అయితే, సాక్ష్యాధారాలు లేకుండా ఎవరిపైనా ఇలా ప్రవర్తించే ఉద్దేశం మాకు లేదని ఉత్తరాఖండ్ డీజీపీ అభినవ్ కుమార్ అన్నారు.పర్వీన్(30) అనే మహిళ మాట్లాడుతూ.. ” నా భర్త ముకీమ్ రోజువారీ కూలీ. ఆయనను పోలీసు అధికారులు తీసుకెళ్లారు” అని చెప్పారు. షాహిద్(35) అనే కూరగాయల విక్రేతను కూడా పోలీసులు పట్టుకున్నారని ఆయన తల్లి వాపోయారు. ఫిబ్రవరి 8న పర్వీన్ బట్టలు ఆరేయటానికి వెళ్లాడనీ, ఆ సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అదుపులోకి తీసుకున్న తమవారిని పోలీసులు.. వారిపై దాడులకు దిగారని పలువురు మహిళలు విలపించారు. పని చేసుకుంటే కానీ పూట గడవని తమ ఇండ్లలో.. మగవారే జీవనాధారమనీ, అలాంటి వారిని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అదుపులోకి తీసుకున్నారని స్థానిక ముస్లిం మహిళలు ఆరోపిస్తున్నారు. తమవారిని విడిచి పెట్టాలని కోరారు.కాగా, పోలీసు చర్య హల్ద్వానీ నుంచి ముస్లింల వలసలను ప్రేరేపించినట్టు కనిపిస్తున్నది. ఫిబ్రవరి 11 ఉదయం, వందలాది మంది ప్రజలు, చేతిలో సామానుతో పొరుగున ఉన్న పట్టణాలు, యూపీలోని నగరాలకు బస్సులు ఎక్కారు. పోలీసుల ఒత్తిడి లేని సురక్షితమైన ప్రదేశాల కోసం వారు వెతుకుతున్నారు.