వతెలంగాణ-ఖమ్మంరూరల్
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో బుధవారం ఉదయం ఖమ్మంరూరల్ పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులతో పాటు కొందరు రెవెన్యూ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 వేల బోగస్ ఓట్లను చేర్పించారని మంత్రి పువ్వాడ అజరు కుమార్‌పై తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంత్రి అజరు సూచన మేరకు కలెక్టర్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు బోగస్ ఓట్లను చేర్పించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్నికల అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆ ఫిర్యాదులో తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు. ఈ ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం తుమ్మల తన నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత పోలీసులు తుమ్మల ఇంట్లోకి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో తుమ్మల భార్యతో పాటు కొందరు అనుచరులు ఉన్నారు. మరోవైపు తుమ్మల నివాసంలో సోదాలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.