పెద్దవూర, పట్టణ, మండల ప్రజలందరికీ పోలీసులు హెచ్చరిక..

నవతెలంగాణ -పెద్దవూర
జిల్లాలో పట్టణాలలో తరచుగా జరుగుతున్న దొంగతనాల నివారణకై పోలీస్ శాఖ వారు శుక్రవారం తగు సూచనలు చేశారు.
ఇంటికి తాళం వేసి దూర ప్రాంతాలకు వ్యక్తిగత పనులపై మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా వెళ్ళే ప్రజలు తమ ఇంటిలో ఎటువంటి విలువైన ఆభరణాలు, నగదు ఉంచవద్దు. అట్టి వాటిని బ్యాంకు లాకర్లో గాని లేదా మరి ఏదైనా రహస్య ప్రదేశంలో గాని భద్రంగా ఉంచుకొనగలరని ఎస్ వీరబాబు తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఇంటి మెయిన్ గేటుకు, ముఖ ద్వారానికి బయటికి కనిపించే విధంగా తాళాలు వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలెను, ముఖ ద్వారానికి కర్టన్ ఏర్పాటు చేసుకొనుట ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. ఇంటికి తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఇంటిలో కనిపించే విధంగా లైట్లు వేసి ఉంచాలని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు తమ ఇంటి ప్రక్క వారికి, బంధువులకి అదే విధంగా పోలీస్ శాఖ వారికి తమ ఇంటిపై నిఘా ఉంచు విధంగా సమాచారం ఇవ్వగలరని కోరారు. వెళ్ళేవారు తమ తమ పోలీస్ స్టేషన్ నందు సమాచారం ఇచ్చినచో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. తాళం వేసి వెళ్ళేవారు ఇంటికి వేసే తాళం విషయంలో తగు జాగ్రత్త తీసుకొని వీలున్నంతవరకు మంచి నాణ్యత కలిగిన సెంట్రల్ లాక్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకొనగలరని అన్నారు.ముఖ ద్వారానికే కాకుండా లోపటి గదులకి సైతం తాళాలు వేసుకొనడం మంచిదని అన్నారు.అలాగే ఇంటిలోని బీరువాలకు వేసిన తాళాలు యొక్క తాళం చెవులను సాధ్యమైనంత వరకు అక్కడే అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త పడాలని కోరారు. కిటికీలు, వెంటిలేటర్స్ విషయంలో సైతం తగు జాగ్రత్త తీసుకోగలరని తెలిపారు.విధిగా ప్రజలు వీలున్నంత వరకు తమ నివాసాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని “దొంగతనాల నివారణ”కు పోలీస్ శాఖకు సహకరించగలరని అన్నారు