రాజకీయ రణం

– కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ హోరాహోరి
– గులాబీకి నివేదికలఅదురు
– సర్కారులోనూ గుబులు
– రసకందాయంలో పవర్‌ పాలి’ట్రిక్స్‌’
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హోరాహోరీ అంటున్నాయి. తగ్గేదెలా అనే తరహాలో తిట్ల పురాణాలు సాగిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ పోటీపడి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. హైడ్రా ఉనికిలోకి వచ్చీ రావడంతో అగ్గిరాజుకుంది. వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి ఘటన దానికి ఆజ్యం పోసింది. తాటాకు చప్పుళ్లకు భయపడబోమంటూ ఇరుపార్టీలూ హుంకరిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు. ఇంకా పరిపాలన గాడిలో పడలేదు. ఎన్నికలు వచ్చే నాలుగైదు నెలల్లో ఉన్నట్టు బీఆర్‌ఎస్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు ప్రజల్లో తమ తాజా పరిస్థితి ఏమిటోననే గుబులు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కనిపిస్తుండగా, ఒక్కొక్కటిగా వస్తున్న విచారణ నివేదికలు బీఆర్‌ఎస్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆరు గ్యారంటీల అమలు సంగతేంటని గులాబీ నేతలు ప్రశ్నిస్తుంటే, మీ పాత కథ అందరికీ తెలుసని కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని మాట వాస్తవం. గత గులాబీ బాస్‌ ఏలికలో రాష్ట్రం అప్పులు రూ. 6 లక్షల కోట్లకుపైగానే పెరిగాయి. దానికి తాజా రేవంత్‌ సర్కారు రూ. 50 వేల కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నది. ఇది ఆర్థిక ముఖ:చిత్రమైతే, రాజకీయ ఆరోపణలు, విమర్శలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విన్యాసాలను ప్రజలు గమనిస్తున్నారు. పరిపాలనను గాడిలో పెట్టి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తే, సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు జనంలో సర్కారును పలుచన చేయాలని బీఆర్‌ఎస్‌ వ్యూహాంతో ఉన్నది. సంక్షేమ పథకాలేవీ సక్రమంగా అమలు కావడం లేదు. రుణమాఫీ, రైతుభరోసా మధ్యలోనే ఆగిపోయింది. రుణమాఫీని ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామనీ, ఆలస్యమైనందుకు మన్నించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రైతులకు క్షమాపణ చెప్పారు. నిధుల్లేకపోవడంతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు సర్కారు జంకుతున్నది. ప్రయివేటుకు పచ్చజెండా ఊపుతున్నది. ఆరు గ్యారెంటీల అమల్లో ఇంకా పరిపూర్ణత రాలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ రెచ్చిపోతున్నది. తాము చేసిన అప్పులను మరిచిపోయి, ఇష్టారాజ్యంగా ఆరోపణలు, విమర్శలతో కాలం గడపడం పట్ల రాజకీయ విశ్లేషకులు పెదవివిరుస్తున్నారు. వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడిని పనిగట్టుకుని గులాబీ నేతలే ప్రొత్సహించారంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై కేసు పెట్టి జైలుకు పంపారు. ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేరును ప్రస్తావించారు. దాడికి బీఆర్‌ఎస్సే కారణమంటూ అందులో ఆరోపణ చేశారు. మరింత లోతైన విచారణ చేసి చార్జిషీట్‌లో కేటీఆర్‌ పేరును చేర్చి అరెస్ట్‌ చేయాలని రేవంత్‌ సర్కారు వ్యూహంగా ఉన్నట్టు గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతల గుసగుసలు పెడుతున్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసులో కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నం చేసినా, తగిన మేర సాక్ష్యాలు లేకపోవడంతో వెనకడుగు వేయాల్సి వచ్చిందనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇదిలావుండగా బీఆర్‌ఎస్‌ను ఉచ్చులో బిగించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కటిగా విచారణ నివేదికలను తెప్పించుకుంటున్నది. ఇప్పటికే విద్యుత్‌ విచారణ కమిషన్‌ గత గులాబీ సర్కారు తప్పిదాలను పేర్కొంటూ నివేదిక సమర్పించినట్టు తెలిసింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంటు శాఖ మేడిగడ్డలో కాంట్రాక్టర్లతో సాగునీటి శాఖ ఇంజినీర్లు కుమ్మక్కయారంటూ నివేదిక ఇచ్చింది. అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇలా జరిగి ఉండోచ్చనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలావుండగా అదే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై జరుగుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ న్యాయ విచారణ కమిషన్‌లోనూ అప్పటి ప్రభుత్వాధినేత కేసీఆర్‌ నిర్ణయాల మేరకే తాము వ్యవహరించామని ఇప్పటికే క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో పలువురు అధికారులు స్పష్టం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. కేసీఆర్‌ సర్కారు తప్పులను బట్టబయలు చేయడం ద్వారా పరిపాలనతోపాటు ప్రజల్లోనూ పైచేయి సాధించాలనే పట్టుదలతో రేవంత్‌ సర్కారు వ్యూహంగా కనిపిస్తున్నది.