మూడుచక్రాల స్కూటీల పథకానికి రాజకీయ గ్రహణం.!

– జిల్లాకు 15 స్కూటీల జారి
– లబ్ధిదారుల ఎంపిక పూర్తి..సిద్దంగా ఉన్న బైకులు..
– గతంలో ఎన్నికల కోడ్‌ కారణంగా మంత్రి ద్వారా ఇవ్వడానికి నెల రోజులుగా ఆగిన పంపిణీ
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో దివ్యాంగుల మూడుచక్రాల స్కూటీల పథకానికి రాజకీయ గ్రహణం పట్టింది. వీటి పంపిణీకి అంతా సిద్ధంగా ఉన్నా జిల్లాలో మంత్రిలు కరుణ చూపించకపోవడంతో నెలల తరబడి కలెక్టరేట్‌లో మూలుగుతున్నాయి.ఒకపక్క లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నా.పంపిణీ చేయడానికి స్కూటీలు రెడీగా ఉన్నా అధికారులు సైతం అమ్మో మంత్రులకు చెప్పకుండా మేమివ్వం అంటూ మొండికేస్తున్నారు. జిల్లాలో మంత్రుల చేతుల  మీదుగా పంపిణీ చేసే వరకు ఖాళీగానే ఉంచుతామంటూ నెలల తరబడి మొండికేసుకుని కూర్చున్నారు.అధికారుల తీరుతో దివ్యాంగ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
జిల్లాలో 15 స్కూటీల మంజూరి: జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు 15 స్కూటీలు మంజూరయ్యాయి. స్కూటీ టివిఎస్‌ కంపెనీకి చెందిన ఈ ఒక్కో బైక్‌ విలువ రూ.95వేలు కాగా దీన్ని ఉచితంగానే లబ్ధిదారులకు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది జూన్‌లో దరఖాస్తులు ఆహ్వానించగా జిల్లావ్యాప్తంగా 140 మంది దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. అందిన దరఖాస్తులను జిల్లా కమిటి పరిశీలించి జిల్లాకు మంజూరైన 15 స్కూటీలకు లబ్దిదారులను ఎంపిక చేశారు. అయితే స్కూటీల పంపిణికి సిద్దం చేయగా ఈ లోగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో స్కూటీల పంపిణి నిలిచిపోయింది.  ఆ తర్వాత జనవరిలో కలెక్టరేట్‌కు మొత్తం 15 స్కూటీలను తరలించి పంపిణీకి సిద్ధం చేశారు. కాని మంత్రులు సమయం ఇవ్వకపోవడంతో పంపిని జరుగడం లేదని సమాచారం
పంపిణీకి కుదరని ముహూర్తం: జనవరిలోస్కూటీలు ఇస్తామని చెప్పిన జిల్లా అధికారులు ఇప్పుడు పిబ్రవరి పూర్తి కావస్తున్నా  ఇంకా పంపిణీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. స్కూటీలను తీసుకువచ్చి కలెక్టరేట్‌లో పెట్టారు. నెల రోజులు కావస్తున్నది. అవన్నీ పాడైపోయే పరిస్థితి వచ్చినా ఖాతరు చేయడం లేదు. ఇదే టని అధికారులను అడిగితే మంత్రుల ద్వారా  లబ్ధిదారులకు స్కూటీలు పంపిణీ చేయాల్సి ఉందని, వాళ్లనుంచి అపా యింట్‌మెంట్‌ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని తీరిగ్గా చెబుతున్నారు.