పొలిటికల్‌ హీట్‌..!

పొలిటికల్‌ హీట్‌..!– పార్లమెంట్‌ ఎన్నికలకు సరికొత్త వ్యూహాలు
– ఆత్మీయ సమ్మేళనాలు, ప్రచార ప్రణాళికలతో హడావుడి
– అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌
– ‘మల్కాజిగిరి’ సెగ్మెంట్‌ పరిధిలో వేడెక్కిన రాజకీయాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో.. ‘మల్కాజిగిరి’ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. కొత్త ఒరవడితో ఆత్మీయ సమ్మేళనాలు, ప్రచార ప్రణాళికలను అమలు చేసే పనిలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఇప్పటికే.. మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్‌ నుంచి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునితా మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి తలపడనున్నారు.
ఎవరి వ్యూహం వారిదే..
మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నాయకులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌, తదితరులు పార్టీలో చేరగా.. ఇతర పార్టీల్లోని కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీని బలహీనపర్చే పని మొదలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి రప్పించే ప్రయత్నాలూ మొదలు పెట్టారు. మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను పెద్దఎత్తున చేర్చుకుంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో సైతం చేరికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులతో బహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రణాళికలు.. ఎత్తుగడలు..
బీసీ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ సీఎం కేసీఆర్‌పైనే యుద్ధం చేసి వచ్చిన ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్‌ కేటాయించిన బీజేపీ.. ఈసారి మల్కాజిగిరి సీటును కైవసం చేసుకోవడానికి అవసరమైన వ్యూహాన్ని రచిస్తోంది. అభ్యర్థి క్షేత్రస్థాయిలో పర్యటించి జనం మధ్యే ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నాగారం మున్సిపల్‌ చైర్మెన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇదే దారిలో మరికొందరు వెళ్లే అవకాశం కనిపిస్తుంది.
బేటీలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌..
రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పార్టీ కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి గురైనా.. లోక్‌సభ ఎన్నికలకు వారిని సన్నద్ధం చేసేందుకు నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ మేమున్నామంటూ రాష్ట్ర నాయకత్వం భరోసానిస్తోంది. కాన్ఫరెన్సులు, సమీక్షల ద్వారా అలర్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహించారు. మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం సెగ్మెంట్‌ పరిధిలో పర్యటిస్తూ క్యాడర్‌, కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా..
గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. లోకసభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో సమావేశమవుతూ సమన్వయం చేసే పనిలో పడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అమలు చేసిన పథకాలు, అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురించి ఓటర్లకు వివరించాలని కాంగ్రెస్‌ క్యాడర్‌కు పిలుపునిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఇక బీజేపీ నేతలు.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రధాని మోడీ అందిస్తున్న సుస్థిర పాలన గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సభలు, సమావేశాలు ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఇలా ప్రధాన పార్టీల వ్యూహాలతో ‘మల్కాజిగిరి’ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఇన్‌చార్జిల నియామకం
మల్కాజిగిరి పార్లమెంట్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన ప్రధాన పార్టీలు ఇన్‌చార్జీలను నియమించాయి. బీజేపీ ఇన్‌చార్జీని నియమించకపోయినా.. ఈటల రాజేందర్‌ అన్ని నియోజకవర్గాల్లోని, అందరు నాయకులను కలుస్తూ ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఇన్‌చార్జి మంత్రిగా నియమించగా.. ఇటీవల మైనంపల్లి హనుమంతరావుకు సైతం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇక బీఆర్‌ఎస్‌ ఇటీవల మల్కాజిగిరి సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకుగాను ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో కో-ఆర్డినేటర్‌ను నియమించింది. మేడ్చల్‌కు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మల్కాజిగిరికి మాజీ జెడ్పీ చైర్మెన్‌ నందికంటి శ్రీధర్‌, కుత్బుల్లాపూర్‌కు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత గొట్టిముక్కల వెంగళరావు, కూకట్‌పల్లికి ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్ది, ఉప్పల్‌కు పార్టీ రాష్ట్ర సెక్రెటరీ జహంగీర్‌ పాష, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు మాజీ చైర్మెన్‌, రావుల శ్రీధర్‌రెడ్డి, ఎల్బీనగర్‌కు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ గుప్తాను నియమించింది.