వెండితెరపై రాజకీయ సినిమాలు

వెండితెరపై రాజకీయ సినిమాలువెండితెరపై రాజకీయాంశాలను జొప్పించటం ద్వారా ప్రజలను ఒక పార్టీ వైపు ప్రభావితం చేయాలనే ప్రయత్నం చాలాకాలం నుంచి సాగుతోంది. నటీనటుల్లో కొందరు రాజకీయ ప్రవేశం చేసి, ప్రజా ప్రతినిధులుగా రాణించటమూ చూశాం. ఎన్టీ రామారావు, జయలలిత వంటి వారు సిఎంలు అవగా, దాసరి నారాయణరావు, చిరంజీవి కేంద్రమంత్రి పదవులను అలంకరించారు. 2019 ఎన్నికల సమయంలో మైనార్టీలను టార్గెట్‌ చేస్తూ బిజెపికి అనుకూలంగా 13 వరకూ సినిమాలు వచ్చాయి. అదే సమయంలో మతోన్మాదాన్ని, పెత్తందారీతనాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన సినిమాలూ ఉన్నాయి.
పొలిటికల్‌ ‘వార్‌’
త్వరలో ఎన్నికలు రానుండటంతో సినిమా తెరపై పొలిటికల్‌ వార్‌ జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా వస్తున్న ఈ సినిమాలు కాకరేపుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వచ్చిన ‘యాత్ర’ సినిమా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా తీశారు. ఆయన కాంగ్రెస్‌ నేతగా ఎదిగి, ముఖ్యమంత్రి అవ్వడం, ఆ తర్వాత పార్టీ అధినాయత్వం లొంగదీసుకునే ప్రయత్నాలను తిప్పికొట్టారంటూ చూపించారు. వాస్తవంగా రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానానికి వీరవిధేయుడిగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల నేపధ్యంలో వైఎస్‌ జగన్‌ను హైలెట్‌ చేస్తూ వచ్చిన సినిమా యాత్ర-2. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌ సిఎం అయ్యే దాకా సాగిన రాజకీయ ప్రస్థానంపై ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో జగన్‌ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ధిక్కరించిన ధీరుడు అన్న రీతిలో చూపించారు. ప్రతిపక్ష పార్టీల నేతలైన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లాంటి వారి పాత్రలకు విలనిజాన్ని జోడించారు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమా మార్చి 1న, ‘శపధం’ సినిమా 8న విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా జగన్‌కు అనుకూలంగానూ, చంద్రబాబు, పవన్‌లకు వ్యతిరేకంగా ఉంటాయనేది ట్రైలర్లను బట్టి చూస్తే తెలుస్తుంది. తాజాగా వచ్చిన ‘రాజధాని ఫైల్‌’ చిత్రం అమరావతినే రాజధాని చేయాలంటూ రైతుల పోరాటం నేపధ్యంలో ఈ సాగింది. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల తీరును ప్రస్తావించారు. వినోద్‌కుమార్‌, వాణీ విశ్వనాథ్‌ నటించారు.
గతంలో …
రాజకీయ అంశాలను కేంద్రంగా చేసుకొని గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. 1987లో వచ్చిన ‘మండలాధీశుడు’ సినిమాలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్ర పోషించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వ్యవహార శైలిని, ప్రభుత్వం తీరునూ వ్యంగ్యంగా విమర్శించారు. కృష్ణ తీసిన ‘ఈనాడు’ సినిమా ఆ తరువాతి ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కొంత దోహదపడిందని అంటారు. కృష్ణ కాంగ్రెస్‌లో చేరిన తరువాత తీసిన తన సొంత సినిమా సింహాసనం ఎన్‌టిఆర్‌కు వ్యతిరేకంగా తీశారు. నా పిలుపే ప్రంభంజనం సినిమాలోనూ కొన్ని డైలాగులు రాజకీయంగా ఎక్కుపెట్టారు. ప్రతినిధి, లీడర్‌, నేనే రాజు నేనే మంత్రి, ఆపరేషన్‌ దుర్యోధన, అధినేత వంటి సినిమాలు రాజకీయ ప్రధానంగా సాగాయి.
ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్‌ ఒకరోజు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. అందులో ముఖ్యమంత్రికి ఓ జర్నలిస్టు – పాలనలో లోపాలు చూపిస్తే ‘నువ్వు ఒక సిఎంగా ఉండు’ అంటూ పదవి కట్టబెట్టం కూడా అప్పట్లో సరికొత్తదనమే. మోహన్‌బాబు నటించిన ‘అసెంబ్లీ రౌడీ’, విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాల్లో రాజకీయ వ్యవస్థ ఆధిపత్య ధోరణులను ఎత్తిచూపారు. హీరో, నిర్మాత, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి తీసే సినిమాలు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపేలా ఉంటాయి. వంగవీటి, రక్త చరిత్ర-1, రక్త చరిత్ర 2, దేవినేని ఎన్‌టిఆర్‌, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, యాత్ర వంటి పొలిటికల్‌ బయోపిక్‌లతోపాటు రంగస్థలం, లెజెండ్‌, ప్రస్థానం, ఎంఎల్‌ఎ లాంటి రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాలు వచ్చాయి. విజయ దేవరకొండ హీరోగా వచ్చిన నోటా సినిమాలో తమిళ రాజకీయం కనిపించింది. సినిమా దానికదే రాజకీయాలను నిర్ధేశించలేదు కాదు కానీ, కొంతమేర ప్రచార సాధనంగా ఉపయోగపడుతుంది.