కోటాలో విద్యార్థుల బలవన్మరణాలపై రాజకీయ పార్టీల స్పందనేది?

– కొనసాగుతున్న ఆత్మహత్యలు
– అయినా.. ఎన్నికల ప్రచారాల్లో లేవనెత్తని వైనం
జైపూర్‌ : రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్నది. పార్టీలు ప్రచారాల్లో నిమగమయ్యాయి. ప్రజలను ఆకర్శించే ప్రయత్నాలను చేస్తున్నాయి. అయితే, ఇలాంటి తరుణంలో ఇటీవల విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు పేరుగాంచిన కోచింగ్‌ హబ్‌ కోటా సమస్యలను రాజకీయ పార్టీలు పట్టించుకోవటం లేవు. అన్ని రాజకీయ పార్టీల అజెండాలో ఈ అంశం అంతగా ప్రాధాన్యంగా కనిపించటం లేదు. భారతదేశంలో అతిపెద్ద కోచింగ్‌ హబ్‌లలో ఒకటైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు, సమస్యలపై చెక్‌ పెట్టటానికి ఇప్పటికే బిల్లులు ప్రతిపాదించబడ్డాయి. పలు సూచనలు సైతం వచ్చాయి. కానీ అవేమీ ఇక్కడ విద్యార్థుల బలవన్మరణాలను ఆపలేకపోయాయి. కోటా 2015 నుంచి అత్యధికంగా ఈ ఏడాది ఆత్మహత్యలను చవిచూడటం గమనార్హం. మొత్తం 25 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. చాలా చిన్న వయస్సులోనే వేలాది మంది విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవటానికి కోటకు వస్తారు. రైల్వే స్టేషన్‌ నుంచి నగరం వెనుక మూల వరకు అంతా విద్యార్థుల సందడే ఉంటుంది. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన కొంతమంది విద్యార్థులు హౌర్డింగ్‌లపై తమ చిత్రాలతో కనిస్తుంటారు. అయితే, లక్ష్యాన్ని సాధించే క్రమంలో కొందరు విద్యార్థులు ఆత్మన్యూనతా భావానికి లోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారని మానసిక నిపుణులు అంటున్నారు. కోటాలో ఈ ఏడాది నివేదికలు సూచించిన దానికంటే ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగానే ఉంటాయనీ, కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు తమ పరువు కాపాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ గణాంకాలను దాచిపెడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీల మాత్రం ఈ విషయంలో సాధారణానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. స్పందించాల్సిన పార్టీలు నిష్క్రియాత్మకంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కోచింగ్‌ పరిశ్రమను వేధిస్తున్న ఈ సమస్యపై రాజకీయ పార్టీలలో ఎలాంటి కదలికా లేకపోవటం ఆందోళనకరమని మేధావులు, సామాజికవేత్తలు అంటున్నారు. ”ఇక్కడికి వచ్చే చాలా మంది విద్యార్థులు అస్సలు ప్రిపేర్‌ అవ్వరు. వారు 15-17 సంవత్సరాల వయస్సులో వస్తారు. ఇది నగరం అందించే జీవనశైలికి లొంగిపోవడానికి, ఇంటికి తిరిగి వెళ్లడానికి దారి తీస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను కనీసం 18 ఏండ్లు వచ్చే వరకు బయటకు పంపకూడదని మేము భావిస్తున్నాము”అని ఒక కంపెనీలో పనిచేస్తున్న ఆనంద్‌ చెప్పారు. ఈనెల 25న రాజస్థాన్‌ ఓటింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో కోచింగ్‌ హబ్‌లోని కోటాలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల భయంకరమైన పరిస్థితి కీలక అంశంగా మారుతుందని విశ్లేషకులు తెలిపారు. డబ్బు సంపాదించే ఈ కోచింగ్‌ ఫ్యాక్టరీలకు చెక్‌ పెట్టే తక్షణ చట్టం అవసరమని వారు నొక్కి చెప్పారు.