నవతెలంగాణ – కామారెడ్డి
నూతన ఓటర్ జాబితా తయారుకి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి నూతన ఓటర్ జాబితా తయారు 2025 పై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ జాబితా నమోదు అనేది నియంత్ర ప్రక్రియ అని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి సర్వే చేసి చనిపోయిన ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, ఇతర ప్రాంతాల నుంచి షిఫ్ట్ అయిన వారి పేర్లను జాబితాలో చేర్చడం, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారి పేర్లను తొలగించడం 1 జనవరి 2025 వరకు 18 సంవత్సరాల వయసు నిండినవారిని ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. నాణ్యత గల ఓటర్ జాబితాను తయారు చేయడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ( లోకల్ బాడీస్) శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్డీవోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కిరణ్, మహమ్మద్ సర్వర్, బిజెపి పార్టీ నుండి వేణు, సంతోష్ రెడ్డి, ఏఐఎంఐఎం జఫర్ ఖాన్, టిడిపి కసిమాలి, బీఎస్పీ హరిలాల్, ఆమ్ ఆద్మీ పార్టీ లాల్ భాష తదితరులు పాల్గొన్నారు.