– సర్కారు బడుల్లో ప్రీప్రైమరీని ప్రారంభించాలి
– తరగతికొక టీచర్, గది, బడికో హెచ్‌ఎం ఉండాలి
– విద్యపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించే అభ్యర్థులనే ఎన్నుకోవాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యారంగాన్ని రాజకీయ పార్టీలు గాలికొదిలేశాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. పార్టీల మ్యానిఫెస్టోల్లో విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో మళ్లీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ నియోజకవర్గానికొక ఉన్నత కులాల్లోని పేద విద్యార్థులకు గురుకులాలను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారని గుర్తు చేశారు. పాఠశాల విద్య మొత్తాన్ని గురుకులాల ద్వారానే అందిస్తామనే ఆలోచన ఆచరణయోగ్యం కాదని పేర్కొన్నారు. వాటిలో ఐదు నుంచి పదో తరగతి వరకు, కొన్నింటి లో ఇంటర్ తరగతులుంటాయని వివరించారు. ప్రస్తుతం అన్ని గురుకులాల్లో కలిపి ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు వివిధ రకాల పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారని పేర్కొన్నారు. 32 లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు బడుల్లో చదువుకుంటున్నా రని వివరించారు. వాటిలో చదివిస్తున్న 50 శాతం కుటుంబాల పిల్లల ఫీజులు భరించలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మన ఊరు-మనబడి పథకంలో మొదటి దశలో 9,123 బడులను బాగుచేస్తామంటూ అట్టహాసంగా ప్రకటించినా 900 స్కూళ్లను కూడా పూర్తి చేసినట్టు లేదని విమర్శించారు. పాఠశాల విద్యను నడిపించే డైరెక్టరేట్ అచేతనా స్థితిలో ఉందని పేర్కొన్నారు. సీఎం, విద్యామంత్రితోపాటు శాసనమండలిలో ప్రస్తావించినా ప్రభుత్వ స్పందన శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య, ఇంటర్ విద్యలో ప్రభుత్వరంగంలో 25 శాతం విద్యార్థులే చదువుతున్నారని తెలిపారు. 75 శాతం మంది విద్యార్థులు ప్రయివేటు విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల విద్యను కూడా ప్రభుత్వ రంగంలో 25 శాతానికి కుదించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేసినట్టు కనిపిస్తున్నదని తెలిపారు. అందుకే పాఠశాల విద్యను భ్రష్టుపట్టించే అధికారులను ప్రభుత్వం కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు.
తంతుగా మారిన ఉపాధ్యాయ దినోత్సవం
సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం ఓ తంతుగా మారిందని నర్సిరెడ్డి విమర్శించారు. రాజకీయ పార్టీల్లో నాయకులు చేరినప్పుడు పార్టీ కండువా కప్పిన తరహాలోనే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో శాలువాలు కప్పుతున్నారని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి కృషిని బ్రోచర్ రూపంలో ముద్రించి ఉపాధ్యాయులందరికీ అందిస్తే ప్రేరణగా ఉంటుందని నాలుగేండ్లుగా అధికారులకు చెప్తున్నా ఆ ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు. ఆ ఎంపిక లోపభూయిష్టంగా ఉంటుందని విమర్శించారు. పైరవీలు, సిఫారసులతో కొంతమందిని ఎంపిక చేస్తున్నందున వారి కృషిని ప్రకటించలేని దుస్థితి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వరంగ పాఠశాల విద్యకు నష్టాన్ని కలిగించిందనీ, ఉపాధ్యాయుల్లో నిర్లిప్తతను పెంచిందని పేర్కొన్నారు. పాఠశాల విద్యలో తమిళనాడు, కేరళ, కర్నాటక, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు మంచి స్థాయిలో ఉన్నాయని వివరించారు. అక్కడ 80 శాతానికిపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. మేఘాలయ మాత్రమే తెలంగాణ కంటే ప్రయివేటీకరణలో ముందున్నదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన యూరప్, అమెరికా, అభివృద్ధి చెందుతున్న చైనా, ఇతర ఆసియా ఖండ దేశాల్లో కూడా పాఠశాల విద్య ప్రభుత్వరంగంలో ఉందని వివరించారు. 90 నుంచి వంద శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వివరించారు. నాణ్యమైన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించడం కంటే గొప్ప ప్రజా సంక్షేమం ఏముంటుందని ప్రశ్నించారు. భావిపౌరులకు చదువు చెప్పడం వదిలేసి గొప్ప సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామంటే అది డొల్లతనమేనని విమర్శించారు. ప్రజలూ కీలకమైన విద్య నుంచి స్పందించాలని తెలిపారు. విద్యపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించే రాజకీయ పార్టీల అభ్యర్థులనే ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు.
పాఠశాల విద్యను సంస్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు :
– ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు (ప్రీప్రైమరీ) ప్రారంభించాలి. ఒకటి నుంచి ఐదు తరగతులకు తరగతికొక గది, టీచర్, బడికో ప్రధానోపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను పునర్‌వ్యవస్థీకరించాలి.
– ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సింగిల్ సెక్షన్, డబుల్ సెక్షన్, మూడు సెక్షన్లు, అవసరమైన చోట నాలుగు, ఐదు సెక్షన్లుగా పరిగణించి ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలి. రేషనలైజేషన్ జీవోను అందుకనుగుణంగా సవరించాలి.
– ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను అవసరమున్నచో ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. అవసరం లేనిచోట ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్ చేయాలి.
– గ్రేటర్ హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు), వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాల్లో 2000 ఏడాది నుంచి కొత్తగా విస్తరించిన ప్రాంతాల్లో, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల మొదలైన గ్రేడ్-1 మున్సిపాల్టీల్లో కొత్తగా విస్తరించిన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను మంజూరు చేసి ప్రారంభించాలి.