నవతెలంగాణ – కామారెడ్డి
ఓటర్ జాబితా పక్కాగా రూపొందించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వేకు తోడ్పాటు ను అందించాలన్నారు. రాజకీయ పార్టీలు బూతు లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వే ను వేగవంతం చేయాలని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో 78, ఎల్లారెడ్డి లో 74, కామారెడ్డి లో 49 శాతం ఇంటింటి సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. ఓటర్ జాబితా నుంచి మృతి చెందిన వారి పేర్లు తొలగించాలని, మార్పులు, చేర్పులను నిర్ణీత ఫారం లో నమోదు చేసుకోవాలని సూచించారు. జనవరి ఒకటి, 2025 నాటికి 18 ఏళ్ల నిండిన యువతీ, యువకుల నుంచి ఓటు హక్కు కోసం ఫారం – 6 ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 18 లోగా ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. సంబంధిత తహసీల్దార్ల సహకారంతో పోలింగ్ బూత్ రేషనలైజేషన్ కు ప్రతిపాదించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ గౌడ్, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.