రాజకీయాలు, వ్యక్తి స్వేచ్ఛలో మతప్రమేయమొద్దు

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, లౌకికవాదానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భారతదేశం ‘మత’ దేశం కాదని, సెక్యూలరిజం కలిగిన దేశమని అన్నారు. సెక్యులరిజాన్ని కాపాడుకునేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహా 4వ వర్ధంతి సభ శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్‌ అధ్యక్షతన నిర్వహించారు. మస్కు నర్సింహా చిత్రపటానికి పూలమాలలేసి నివాళ్లులర్పించారు. అనంతరం ‘మతం-మతోన్మాదం’ అనే అంశంపై తమ్మినేని మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ గత పార్లమెంటు ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని మతోన్మాదాన్ని రెచ్చగొట్టిందని విమర్శించారు. ముస్లిం, క్రిస్టియన్‌, దళితులపై దాడులు కొనసాగుతు న్నాయని ఆందోళన వెలిబుచ్చారు. భారత రాజ్యాంగం పట్ల కుట్రలను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు మస్కు నర్సింహా లాంటి పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్‌లో జరిగే పోరాటాలకు మరింత ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.యాదయ్య, జగదీష్‌, మధుసూదన్‌రెడ్డి, కవిత, నాయకులు రామచందర్‌, జగన్‌, సిహెచ్‌.జంగయ్య, కిషన్‌, శ్యాంసుందర్‌, ఆలంపల్లి నరసింహ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.