– స్థానిక ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి
– పాతాయనకే ఎన్నిసార్లు ఎయ్యాలే..
– కొత్తోళ్లకేత్తే ఏమవుతుంది.?
– ప్రజల్లో చర్చోపచర్చలు
ఏ నియోజకవర్గంలో చూసినా రాజకీయ ‘మార్పు’ కనిపిస్తోంది. మార్పు రావాలని చర్చ జరుగుతోంది. కాళోజీ నారాయణరావు చెప్పినట్టు ‘కాలంబు రాగానే కాటేసి తీరాలే..’ అన్న కవిత ప్రస్తుత రాజకీయాలకు దర్పణంగా కనపడుతోంది. క్షేత్రస్థాయిలో ‘మార్పు’ ఏ స్థాయి వరకు వెళ్లిందనే విషయంలో భిన్నా భిప్రాయాలున్నా అనూహ్యమైన రాజకీయ మార్పులు జరుగుతుండటంతో రాజకీయ పండితులు సైతం విస్మయానికి గురవుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలలో లోపాలు బహిర్గతం కావడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. నిధులు, విధులు లేక స్థానిక ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడ్డా, అప్పుసప్పులు చేసి పనులు చేసినా బిల్లులు చెల్లించకపోవడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో మార్పు కోరుతూ పార్టీ మారుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోస్థాయిలో ‘మార్పు’ రాజకీయాలున్నాయి.
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బహిర్గతమవుతోంది. ‘పాతాయనకే ఎన్నిసార్లు ఎయ్యాలే.. ఒక్కసారి కొత్తోళ్లకేత్తేంది..?’ అన్న చర్చ జరుగుతుండటం గమనార్హం. ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారాలకు మస్తుగా జనం వస్తున్నరు.. పోతున్నరు.. అదే సమయంలో ‘మార్పు’ మీద కూడా మస్తు చర్చ జరుగుతోంది.. గ్రామగ్రామాన ఇదే పరిస్థితి కనిపిస్తుండడంతో బీఆర్‌ఎస్‌లో గుబులు ప్రారంభమైంది. వలసలపైనా ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.
స్థానిక ప్రజాప్రతినిధుల కట్టడి
స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం సైతం పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో ఐదేండ్లుగా స్థానిక సంస్థల అభివృద్ధికి ఇచ్చిన నిధులు అరకొరనే. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఈలోపు పనులు చేస్తే తరువాత బిల్లులు ఎత్తుకోవచ్చని అధికారులు తొందరపెట్టడంతో స్థానిక ప్రజాప్రతినిధులందరూ పనులు చేయడానికి అప్పులు చేశారు. కానీ నిధులు రాక.. అప్పుల్లో కూరుకుపోయిన ప్రజాప్రతినిధులు మండల సర్వసభ్య సమావేశాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పలు మండలాల్లో బీఆర్‌ఎస్‌కు రాజీనామా ప్రకటించగానే ఎమ్మెల్యేలు వారిని కట్టడి చేయడం తెలిసిందే. ఆ పరిణామాలన్నింటినీ ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు నెమరు వేసుకుంటున్నారు.
సభలకు స్పందన కరువు..
వర్ధన్నపేట నియోజకవర్గంలోని భట్టుపల్లిలో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి ఎలాంటి స్పందన లేకపోగా, ఆయన మాట్లాడటం ప్రారంభం కాగానే జనం లేచి వెళ్లడంతో 20 నిమిషాల్లో సభను ముగించారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలోనూ చెణుకులు బెణుకులు లేవు.
ప్యాకేజీ స్టార్లతో గందరగోళం
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో చేరికలు, వలసలు సర్వసాధారణమయ్యాయి. బీఆర్‌ఎస్‌లోకి వచ్చేవాళ్లకు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నట్టు ప్రచారంలో వుంది. ఎమ్మెల్యేల వ్యవహారశైలితో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. మరో 22 రోజులపాటు ప్రచారానికి సమయమున్న క్రమంలోనే భారీ మార్పులు చోటు చేసుకుంటుండటంతో రానురాను రాజకీయాలు మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు లేకపోలేదు.