జడ్జీల ‘పాలి’ట్రిక్స్‌

Judges' 'Poly' Tricks– అధికార పార్టీని సంతృప్తిపరిచే విష సంస్కృతి
– న్యాయవ్యవస్థనూ లోబరచుకునే ప్రమాదకర ధోరణి
– మోడీ సర్కార్‌ తీరుతో పెనుముప్పు:విశ్లేషకులు, మేధావులు
దేశంలో న్యాయ వ్యవస్థ రాజకీయమయం అయిందా? రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు న్యాయమూర్తులు వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారా? ప్రజాస్వామిక వ్యవస్థలో నిస్పాక్షిక న్యాయం లభిస్తుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయా? ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యం మూలస్తంభాల్లో న్యాయ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వాలు హద్దులు మీరినప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగినప్పుడు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. పాలకుల దూకుడుకు కళ్లెం వేసి పరిస్థితిని చక్కదిద్దుతుంది. కానీ ఇప్పుడు దేశంలో ఇందుకు భిన్నమైన వాతావరణం కన్పిస్తోంది. పాలకులు తమకు అనుకూలంగా తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులకు పదవీ విరమణ చేయగానే.. రాజకీయ పదవులు కట్టబెట్టి సంతృప్తి పరిచే విష సంస్కృతి ప్రబలిపోయింది. న్యాయ వ్యవస్థను సైతం లోబరచుకునే ప్రమాదకరమైన ధోరణి పాలకుల్లో కన్పిస్తోంది.
గత కొంతకాలంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గణోపాధ్యాయ పేరు పత్రికల పతాక శీర్షికల్లో కన్పిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫక్తు రాజకీయ నాయకుడి మాదిరిగా ఆయన విమర్శలు కురిపించారు. టీఎంసీ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులపై విచారణలకు ఆదేశించారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం తప్పుకాదు కానీ ఆయన హద్దు దాటారన్న విమర్శలు వచ్చాయి. పాఠశాల ఉపాధ్యాయుల నియమకానికి సంబంధించిన కుంభకోణం కేసును గత సంవత్సరం ఆయన విచారించారు. ఈ కేసుపై ఆయన అసాధారణ రీతిలో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడం సిట్టింగ్‌ న్యాయమూర్తుల పనికాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయినప్పటికీ గణోపాధ్యాయ తన వైఖరిని మార్చుకోలేదు. కలకత్తా బార్‌ కౌన్సిల్‌తో కూడా ఆయన ఘర్షణకు దిగారు. జాతీయ స్థాయిలో ఓ వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అటు తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా కోర్టులు, ప్రభుత్వానికి సంబంధించి గత సంప్రదాయాలకు భిన్నంగా గణోపాధ్యాయపై ఆరోపణలు సంధించింది. ఆయన ఓ న్యాయమూర్తిగా కాకుండా బీజేపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. ఈ నేపథ్యంలో గణోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. పత్రికా సమావేశంలో ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. వాస్తవానికి ఆయన పదవీకాలం ఆగస్టుతో ముగుస్తుంది. దానికి ముందే ఆయన ఎందుకు రాజీనామా చేశారు? లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌ పొందేందుకా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తన పోటీపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెబుతుండడం గమనార్హం.పాలకుల పట్ల న్యాయమూర్తులు విధేయత ప్రకటించడం, తదనంతర కాలంలో పదవులు పొందడం ఇది మొదటిసారి కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోరు పదవీకాలం పూర్తయిన తర్వాత బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. అయోధ్య కేసులో గొగోరు ఇచ్చిన తీర్పుకు ప్రతిఫలంగా ఆయనకు ఎంపీ పదవి లభించిందన్న విమర్శలు వచ్చాయి. ఇందులో నిజం ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే న్యాయ మూర్తులు తమ పదవీకాలంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చి, పదవీవిరమణ చేసిన తర్వాత పదవులు పొందడంపై సందేహాలు వ్యక్తం కావడం సహజమే. దీనివల్ల న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది.