మేడిగడ్డ కుంగిపాటుపై రాజకీయం

Politics on Madigadda sag– రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కాపాడే ప్రయత్నం : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ-మహాదేవపూర్‌
రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆగమై మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర నిపుణులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం మేడిగడ్డ సందర్శనకు వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రాజెక్ట్‌ సందర్శనకు అనుమతివ్వడంతో పోలీసు పహరా మధ్య సందర్శించారు. అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు కుంగిన రోజు విద్రోహ చర్య అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యాలను పక్కన పెట్టేసి ఎవరో ఏదో చేశారని వేరే వారిపై ఉద్దేశపూర్వకంగా నెట్టి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నిపుణులు మాట్లాడే మాటల్లో తేడా ఉందని, ముందుగా నాణ్యత లోపం లేదని టెక్నికల్‌ మిస్టేక్స్‌ ఉన్నాయంటూ ప్రకటనలు చేయడం సరికాదన్నారు. తక్కువ వ్యవధిలో ప్రారంభించి పూర్తి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్‌ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని, ఉన్నత న్యాయస్థానం ద్వారా విచారణ చేయించి ఖర్చుల లెక్కలను తేల్చాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టులనేవి భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడతాయని, ఇప్పటివరకు ప్రాజెక్టులు పొంగిపోయిన దాఖలాలు లేవని అన్నారు. కరీంనగర్‌లో నిర్మించిన తీగల బ్రిడ్జి ఇలాగే జరిగిందని, కమిషన్లు తీసుకునే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం నాణ్యత పాటించలేదని అన్నారు. సీఎం కేసీఆర్‌కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. సందర్శించిన వారిలో.. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేనా శంకర్‌ పష్యా, పద్మ, ఇటీ నరసింహ, భూపాలపల్లి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు కొరిమి రాజ్‌కుమార్‌, రాముడు, లక్ష్మణ్‌, తాండ్ర సదానందం, నాయకులు పాల్గొన్నారు.