ప్రాణాంతకంగా మారిన పోల్కంపల్లి, రాయపోలు రోడ్డు

– సీపీఐ(ఎం) మండల కార్యవర్గ సభ్యులు పి.జగన్‌
– పట్నం ఎంపీడీఓకు పోల్కంపల్లి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పోల్కంపల్లి నుండి రాయపోల్‌ వెళ్లే రోడ్డు కంకర తేలి ప్రాణాంతకంగా మారిందని, ఈ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇబ్రహీంపట్నం సీపీఐ(ఎం) మండల కార్యవర్గ సభ్యులు పి.జగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం ఎంపీడీఓకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు పి.జగన్‌ మాట్లాడుతూ పోల్కంపల్లి నుంచి రాయపోల్‌ వెళ్లాలంటే రోడ్డు మొత్తం కంకర తేలి ఇబ్బందిగా మారిందని అన్నారు. ఈ రోడ్డు గుండా నిత్యం వందలాది మంది వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ఈ రోడ్డు వేసి చాలా కాలం కావడంతో కంకర తేలి, గుంతల మయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూలమలుపుల వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఒకేచోట కనీసం రెండు బస్సులు కూడా పట్టనంతగా ఇరుకుగా ఉన్నదని అన్నారు. గతంలో కురిసిన వర్షాలకు వరదలు వచ్చినప్పుడు రోడ్డు అక్కడక్కడ కోతకు గురై ప్రమాదంగా ఉండడంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి ఈ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేసి, రోడ్డును విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీటీసీ నీరుడు భిక్షపతి, సంఘం నాయకులు పల్లపు రవి, తదితరులు పాల్గొన్నారు.