– రోడ్డుపై బైటాయించి ధర్నా
– అధికారుల జోక్యంతో ఓటింగ్‌లో పాల్గొన్న ఓటర్లు
నవతెలంగాణ-కొత్తూరు
పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలంటూ గిరిజనులు మెరుపు ధర్నాకు దిగారు. గ్రామ పంచాయతీగా ఏర్పడినా పోలింగ్ బూత్ లేక ఎన్నికల సమయంలో తండావాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ తండాలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేకపోవడంతో సోమవారం గిరిజనులు రోడ్డుపై బైటాయించి తమ నిరసన తెలిపారు.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని కొడిచల్ర తాండ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 500 జనాభా గలిగిన తండాలను, ఆమ్లెట్ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. గ్రామపంచాయతీ పరిధిలోని కొడిచెర్లతండా, ఖాజాగూడ తండాలను కలిపి అప్పటి ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీని ఏర్పాటు చేసింది. ఐదేండ్లు పూర్తయినా ఆ తండాలో నేటికీ పోలింగ్ బూత్ లేక నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గ్రామంలో కనీస అవసరాలను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, రేషన్ తీసుకోవాలన్నా 4కి.మీ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్య పరిష్కరిస్తా : తహసీల్దార్ రవీందర్ రెడ్డి
పోలింగ్ కేంద్రం లేక ఎన్నికల సమయంలో అనేక అవస్థలు పడుతున్నామని కొడిచర్ల తండా గిరిజనులు రోడ్డుపై మెరుపు ధర్నాకు దిగడంతో తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, సీఐ నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకొని గిరిజనులతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం నెల రోజుల్లోగా రేషన్ దుకాణం ఏర్పాటుతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల లోపు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో గిరిజనులు శాంతించి ఓటింగ్‌లో పాల్గొన్నారు.