పోలింగ్‌ ప్రశాంతం

Polling is peaceful– తెలంగాణలో 64.74 శాతం నమోదు
– మరికొంత పెరిగే అవకాశం
– మంగళవారం మధ్యాహ్నం వరకు తుది గణాంకాలు : ఎన్నికల సంఘం వెల్లడి
– పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు
– భారీ భద్రత నడుమ స్ట్రాంగ్‌రూంలకు తరలింపు
– ఈవీఎంలలో నేతల భవితవ్యం
– జూన్‌4న తేలనున్న ఫలితాలు
లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ పరిధిలో పోలింగ్‌ ప్రశాంతగా ముగిసింది. రాష్గ్ర వ్యాప్తంగా 64.74 శాతానికి పైనే పోలింగ్‌ నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం వరకు పోలింగ్‌ శాతానికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 66.4 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఈ సారి కూడా అదే స్థాయిలో పోలింగ్‌ నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సోమవారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ 11 గంటల నుంచి ఊపందుకుంది. మొదటి రెండు గంటల్లో 9.8 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఆ తర్వాత వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 40.38 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎండ తీవ్రత ఉన్నా మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడటంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటేసేందుకు జనం బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా ఎప్పటిలాగే హైదరాబాద్‌ వాసులు బద్దకించారు. మారుమూల సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మధ్యాహ్నం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. మిగతా 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ ముగిసే సమయానికి 1500కు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు వరుసలో నిలబడి ఉన్నందున వారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత పోలింగ్‌ ఆఫీసర్ల (పీవో) తనిఖీ అనంతరం ఈవీఎంలను భారీ భద్రత నడుమ స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాటికి మూడంచెల భద్రత కల్పిస్తారు. ఈ ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కొంతమంది నేతలు పోలింగ్‌ కేంద్రాల్లో దురుసుగా ప్రవర్తించడం, ఓటింగ్‌ సరళిపై కామెంట్లు చేయడం మినహా ఎలాంటి గొడవలూ జరగలేదు.రీ పోలింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ప్రిసైడింగ్‌ అధికారులు, పరిశీలకులు ఇచ్చే నివేదికల ఆధారంగా మంగళవారం రీపోలింగ్‌పై ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మొరాయించిన ఈవీఎంలు
రాష్ట్ర వ్యాప్తంగా పలు కేందాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వనపర్తి జిల్లా అమరచింత జెడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌ 228/77లో ఈవీఎంలు మొరాయించాయి. రెండు గంటల పాటు ఈవీఎంలు పని చేయకపోవడంతో వాటిని రీప్లేస్‌ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 100కు పైగా సెంటర్లలో ఈవీఎంలు మొరాయించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తిన వాటికి మరమ్మతులు చేయగా, మిగతా వాటిని మార్చడంతో పోలింగ్‌ సజావుగా సాగిందని పేర్కొంది.