– 7 గంటల నుంచి ఓటింగ్ షురూ
– 119 అసెంబ్లీ స్థానాలు…2,290 మంది అభ్యర్థులు
– 3,26,18,205 మంది ఓటర్లు
– భారీ బందోబస్తు
– నలుగురు పోలీస్ అధికారులపై వేటు
– డేగకన్నుతో ఎన్నికల సంఘం నిఘా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్థానాల పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. బుధవారం ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరారు. గురువారం ఉదయం 5.30 గంటలకు రాజకీయపార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి జనరల్ పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ బూత్‌ల్లో ఎంతమంది ఉంటే, వారందరూ ఓటు హక్కు వినియోగిం చుకొనే వరకు పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 119 అసెంబ్లీ స్థానాలకు 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3,26,18,205 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేం దుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గురు వారం అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్, ఐటీ సంస్థలకు సెలవులు ప్రకటించింది. నిబంధన లు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించింది. ప్రజలందరూ ఓటు హక్కు ను స్వేచ్ఛగా వినియోగిం చుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 3వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది. 49 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, పక్షపాతంతో వ్యవహరించారని నలుగురు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు సస్పెండ్ చేశాయి. వరంగల్ అర్బన్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్‌పెక్టర్ ఏ అంజిత్‌రావును ఆ జిల్లా డీసీపీ జీ అంజన్‌రావు సస్పెండ్ చేశారు. మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి తరఫున ఆయన కారులో డబ్బును తరలిస్తున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర శివార్లలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకొని, నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వరంగల్ హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లారనే కారణంతో అంజిత్‌రావును సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మరో కేసులో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎమ్ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ ఏ యాదగిరి, ఇన్స్‌పెక్టర్ ఎస్‌హెచ్ జహంగీర్ యాదవ్‌లను కూడా సస్పెండ్ చేశారు. ముషీరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ కుమారుడు ముఠా జయసింహ కారులో రూ.18 లక్షల నగదుతో పట్టుబడ్డారు. ఈ కేసులో జయసింహ పేరును తప్పించి, మరో ఇద్దరిపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు ఆరోపణలు రావడంతో పై అధికారులందరినీ సస్పెండ్ చేసినట్టు సమాచారం.
మొత్తం ఓటర్లు – 3,26,18,205 మంది
పురుష ఓటర్లు – 1,63,13,268
మహిళా ఓటర్లు – 1,63,02,261
18-19 వయసు కొత్త ఓటర్లు – 9,99,667
80 ఏండ్లు పై బడిన ఓటర్లు – 4,40,371
విదేశీ ఓటర్లు (ఎన్‌ఆర్‌ఐ) – 2,944
వికలాంగ ఓటర్లు – 5,06,921
మొత్తం పోలింగ్ సిబ్బంది – 2,08,000
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు – 12,570
వెబ్‌కాస్టింగ్ పోలింగ్ స్టేషన్లు – 27,094
కేంద్ర బలగాలు – 375 కంపెనీలు
రాష్ట్ర పోలీసులు – 45 వేలు
ఇతర శాఖల భద్రతా సిబ్బంది – 3 వేలు
టీఎస్‌ఎస్‌పీ కంపెనీలు – 50
పొరుగు రాష్ట్రాల హౌంగార్డులు, పోలీసులు – 23,500