నేడే పోలింగ్‌

Polling today– ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం
– 17 లోక్‌సభ, కంటోన్మెంట్‌ అసెంబ్లీకి ఎన్నికలు
– లోక్‌సభ బరిలో 525 మంది, కంటోన్మెంట్‌ బరిలో 15 మంది
– రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లు
– నిర్దేశిత సమయానికి క్యూలో ఉన్న వారికే ఓటేసేందుకు అనుమతి
– పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ పకడ్బందీ చర్యలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి నేడు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం రాత్రికల్లా ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5.30 గంటలకు పోలింగ్‌ అధికారులు(పీవో) మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఏజెంట్లనుంచి ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని నివృత్తి చేసి ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభిస్తారు. సమ్యస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, మిగతా 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,809 పోలింగ్‌ కేంద్రాల్లో 3,32,32,318 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. పోలింగ్‌ ముగిసే సమయానికి వరుసలో నిలబడే వారికి ఎంత సమయమైనా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఈవీఎంలను ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో సీల్‌ చేసి జీపీఎస్‌ వాహనంలో కేటాయించిన స్ట్రాంగ్‌ రూంలకు తరలిస్తారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాటికి మూడంచెల భద్రత కల్పిస్తారు. ఇన్నర్‌ సర్కిల్‌లో కేంద్ర దళాలు, సెకండ్‌ సర్కిల్‌లో స్టేట్‌ రిజర్వ్‌ దళాలు, చివరి సర్కిల్‌లో స్థానిక పోలీసులు పహారా కాస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 525 మంది అభ్యర్థులు
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధానంగా ముఖాముఖి పోటీ నెలకొని ఉంది. బీజేపీ బలంగా ఉన్న కరీంనగర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ లాంటి కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉందని భావిస్తున్నారు. పార్టీ మారి ఇతర పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన దానం నాగేందర్‌, కడియం కావ్య, బీబీ పాటిల్‌, రంజిత్‌ రెడ్డికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, లోక్‌సభకు పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌లకు సైతం ఈ ఎన్నికలు చావోరేవో తేల్చనున్నాయి. కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు 15 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. డబ్బు, అధికారం, కులం, తదితర అంశాల ప్రాతిపదికన హోరాహోరీగా సాగిన ఎన్నికల సంగ్రామంలో ఓటర్లు ఎవరిని కనికరించారన్నది జూన్‌ 4న తేలనుంది.
ఈవీఎంలు మొరాయిస్తే రీప్లెస్‌
పోలింగ్‌ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయిస్తే ఈసీ నిబంధనల ప్రకారం సెక్టర్‌ ఆఫీసర్లు మార్చనున్నారు. ఇందుకోసం 25 శాతం ఈవీఎంలను అదనంగా అన్ని నియోజక వర్గాల వారీగా అందుబాటులో ఉంచారు. చిన్న చిన్న సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే బాగు చేసేందుకు వాటిని సరఫరా చేసిన ఈసీఐఎల్‌ కంపెనీ ఇంజినీర్లు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఇద్దరేసి చొప్పున అందుబాటులో ఉంటారు. పోలింగ్‌ స్టేషన్లో దౌర్జన్యం, ఓట్ల గందర గోళం, రిగ్గింగ్‌, ప్రలోభాలు లాంటి సంఘటనలు జరిగితే స్థానికి పీవో ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశిస్తుంది.
ఓటర్లకు ఈసీ సూచనలు
1). ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు ఎవరూ తమ మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.
2). ఓటు వేసేటప్పుడు స్లిప్‌ కనిపించే వరకు (7 సెకన్లు) బటన్‌ను నొక్కి ఉంచండి.
3) ఈవీఎం మెషీన్‌లోని బటన్‌ను నొక్కినప్పుడు స్లిప్‌ బయటకు వచ్చే వరకు బటన్‌ నుండి వేలిని తీసివేయకూడదని గుర్తుంచుకోండి.
4) స్లిప్‌తో మీ ఓటు వేశామని నిర్ధారించుకున్న తర్వాత బయటకు రండి
5). మీ ఓటు ఇదివరకే ఎవరైనా వేస్తే వెంటనే పీవోకు ఫిర్యాదు చేసి టెండర్‌ ఓటు వేయవచ్చు
6). పోలింగ్‌ స్టేషన్లో అవకతవకలు జరిగితే వెంటనే సీ విజిల్‌, 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌ ఎన్‌జీఎస్‌పీ పోర్టల్‌ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయండి.