– బారులుతీరిన ఓటర్లు
– సత్ఫలితాలు ఇచ్చిన ఓటరు అవగాహన కార్యక్రమాలు
– ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి
– కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ స్థితిగతులను పర్యవేక్షించిన కలెక్టర్
నవతెలంగాణ-కంటేశ్వర్ : రాష్ట్ర శాసనసభ-2023 ఎన్నికలకు సంబంధించి గురువారం జరిగిన పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆరు నియోజకవర్గాల పరిధిలో 1549 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్ జరిపిన అనంతరం అన్ని చోట్ల ఈ.సీ నిర్దేశించిన మేరకు ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొదటి రెండు గంటల వరకు ఒక మోస్తరుగా సాగిన ఓటింగ్, అనంతరం అంతకంతకూ ఊపందుకుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తూ ఓటు వేసిన జిల్లాలోని ఓటర్లందరికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. నియోజకవర్గాల వారీగా మహిళలు, యువత, దివ్యంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్లు ప్రజలను ఆకర్షిస్తూ, ఓటింగ్ ప్రాధాన్యత గురించి అందరినీ ఆలోచింపజేసాయని కలెక్టర్ అన్నారు. గత ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ జరిగిన నియోజకవర్గాలపై, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ స్వీప్ కార్యకలాపాలలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద సాయుధ బలగాలను మోహరించడంతో పాటు వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షించామని తెలిపారు. కాగా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉదయం వేళలోనే జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ బాలుర ఐ.టి.ఐ లోని 216 నెంబరు పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పలు పోలింగ్ బూత్ లను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సి హాల్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఉదయం నుండి మొదలుకుని ఓటింగ్ ముగిసేంత వరకు ఆయా నియోజకవర్గాలలో కొనసాగిన పోలింగ్ తీరుతెన్నులను అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఆయా పోలింగ్ బూత్ లలో నెలకొని ఉన్న పరిస్థితులను కంట్రోల్ రూమ్ మానిటర్ లలో ప్రత్యక్షంగా వీక్షిస్తూ, ఎక్కడైనా చిన్నచిన్న లోటుపాట్లను గమనించిన వెంటనే సంబంధిత అధికారులు, సెక్టోరల్ ఆఫీసర్లను అప్రమత్తం చేస్తూ పరిస్థితులను చక్కదిద్దారు.