నేటినుంచి పాలిసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌

– 22 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
– 27 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం
– 30న తొలివిడత సీట్ల కేటాయింపు
– 118 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 26,412 సీట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌, డిప్లొమా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పాలిసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నుంచి ఈనెల 24 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించొచ్చనీ, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఈనెల 22 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. అదేనెల 22 నుంచి 27 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని పేర్కొన్నారు. ఈనెల 30న తొలివిడత పాలిసెట్‌ ప్రవేశాలకు సీట్లను కేటాయిస్తామని తెలిపారు. అదేనెల 30 నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు ఫీజు చెల్లించాలనీ, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://్‌స్త్రజూశీశ్రీyషవ్‌.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలో 118 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 26,412 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 24 కోర్సులున్నాయని తెలిపారు. డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)లో అత్యధికంగా 6,118 సీట్లు, డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ)లో 5,203 సీట్లు, డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ)లో 5,178 సీట్లు, అత్యల్పంగా డిప్లొమా ఇన్‌ ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్‌లో 40 సీట్లున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలిసెట్‌కు 92,808 మంది దరఖాస్తు చేస్తే, 82,809 మంది అభ్యర్థులు రాతపరీక్షకు హాజరయ్యారు. వారిలో 69,728 (84.20 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 26,412 సీట్లుంటే, 69,728 మంది ఉత్తీర్ణులైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు.