– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి పీఎస్‌ఎస్‌సీ, ఏఐడీఎస్‌వో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతి విద్యాసంవత్సరంలోనూ పాలిటెక్నిక్ విద్యార్థులకు రెగ్యులర్‌తోపాటు సప్లిమెంటరీ పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని పీఎస్‌ఎస్‌సీ, ఏఐడీఎస్‌వో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని పీఎస్‌ఎస్‌సీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ నాగరాజు, ఏఐడీఎస్‌వో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్ శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. సీ-18 స్కీం నుంచి ఏటా ఒక్కసారి మాత్రమే సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతేడాది విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు లేనందున ఏడాది విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. సీ-18, సీ-21 స్కీం బ్యాచ్ విద్యార్థులకు ఏప్రిల్‌లో జరగబోయే రెగ్యులర్ పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని కోరారు.