చెరువులెక్కడీ చేపలెక్కడీ

Pond count is fish countఅనగనగా అన్నా అనకపోయినా ఉన్నాడొక రాజు. రాజన్నాక రాజ్యం వున్నాక కోట, తోట, రాణీ వుండాలి కనుక వున్నారు. రాజూ రాణీ వున్నాక ఒకరో ఇద్దరో ఏడుగురో కొడుకులుండాలి కదా మరి, వున్నారు.
రాజుగారి ఏడుగురు కొడుకులూ ఎదిగేకొద్దీ, రాజావారూ ముసలి వారవడం మొదలైంది. జుట్టు తెలుపైంది. నోటిలో వుండేవి వదులైనవి. నడక పట్టుతప్పింది. ఊపిరితిత్తులు నత్తనడక మొదలుపెట్టాయి. కళ్లెదుట నల్లదారపు పోగులు కనిపించసాగాయి.
ఓనాడు మంచం మీద రాజావారుంటే, మంచం చుట్టూ ఏడుగురు రాకుమారులూ వున్నారు. అందరూ వున్నారా? అన్నాడు రాజు చుట్టూ తిప్పడానికి మెడ సహకరించక.
ఉన్నాం డాడీ, అందరమూ అంటే ఏడుగురమూ వున్నాం అన్నాడో యువ కిశోరం.
అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, రాజు పోయాక రాజ్యం పెద్ద కొడుకే పాలించాలి న్న బూజుపట్టిన ఓల్డు ట్రెడిషన్‌కి నేను పూర్తిగా వ్యతిరేకిని అని రాజుగారు అంటూ వుంటేనే…
మాకు తెలుసు డాడీ. మీవన్నీ అభ్యుదయ భావాలే. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లం కాం. చెప్పాలనుకున్నదేమో సూటిగా చెప్పేయండి. యూట్యూబర్లా తంబ్‌నెయిల్‌ ఒకటీ, కంటెంటు ఒకటీ కాకుండా విషయాన్ని చూయింగ్‌ గమ్‌లా సాగదీయకుండా అన్నాడింకో యువసింహం.
అయితే ఉపోద్ఘాతం డిలీట్‌ చేసి పాయింట్‌కు వస్తా! ఇవాళ కాకపోతే రేపు, కాకపోతే ఓ వారం, లేదా నెల లోపునో నేను బయలుదేరి వెళ్లి తిరిగిరాని లోకానికి చేరుకోక తప్పదు కదా అన్నాడు రాజు.
ఉపోద్ఘాతం లేకుండానే అంటూ లాగేస్తున్నారు. పుట్టాక రాజులైనా, మంత్రులైనా శ్రీమంతులైనా, ప్రభుత్వ ఉచిత పథకాల మీద బతికే పేదోళ్లయినా మరి తిరుగు టిక్కెట్టు అదే రిటర్న్‌ టికెట్‌ లేని చోటికి వెళ్లాల్సిందే. దాని గురించి ఎవరూ వర్రీ అవాల్సిన పనే లేదు అన్నాడు తత్వం తెలిసిన యువ మహర్షి.
గుడ్‌! ట్రూత్‌ ఈజ్‌ ఆల్వేస్‌ ట్రూత్‌! మీరంతా నాకు ‘హ్యాపీ జర్నీ’ చెప్పాలంటే నేను చెప్పింది చేయగలిగిన వాడిని, రాజ్యానికి రాజుగా ప్రకటించాలంటే… అని ఆయన అంటూ వుంటేనే ఏం చెయ్యాలో చెప్పండి పితాశ్రీ అన్నాడింకో కొడుకు ఉత్సాహంగా.
మా తండ్రితాతల హయాంలో మన నగరంలో ఏడు చెరువులు వుండేవట. నా రూలింగ్‌లో బిజీగా వుండి నేను పట్టించుకోలేదు. మీరు ఏడుగురు బయలుదేరి వెళ్లి, ఆ ఏడు చెరువులూ ఎక్కడున్నాయో కనిపెట్టి ఒక్కో చెరువులో నుంచి నా సాటిస్‌ఫాక్షన్‌ కోసం ఏడు చేపలూ తేవాలి. ఎవరు ముందుగా చేపను తెచ్చి చూపితే వాడే ఈ రాజ్యానికి రాజు అన్నారు రాజావారు మధ్యలో వచ్చిన దగ్గును వీరోచితంగా పోరి, జయించి.
ఓస్‌, ఇంతేనా? ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ తెమ్మంటారని భయపడ్డాం. అనగనగా ఓ రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు అనే కథ గుర్తుకొస్తుంది పదండి బ్రదర్స్‌… చెరువుల జాడకు చేపల వేటకు అన్నాడో యువరాజు.
రాజుగారి ఏడుగురు కొడుకులు ఏడు చెరువుల చిత్రపటాలు పట్టుకుని బయల్దేరారు, మందీ మార్బలంతో. చెరువుల జాడ వెతుక్కుంటూ గుర్రాలు వెళ్లగలిగినంత దూరం గుర్రాలెక్కారు. ఆ తర్వాత కాలినడకన గాలింపు చేశారు. కనబడిన వాడినల్లా చిత్రపటం చూపి ఈ చెరువును ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా అని బతిమాలారు. చాలామంది చిత్రపటంలోని చెరువుల్ని ఎగాదిగా చూసి, వాటిని చెరువులంటారా? వీటినిండా నీళ్లుంటాయా? వీటిలో చేపలనేవీ వుంటాయా? అని ప్రశ్నించసాగారు. ఇలాగ దారినపోయే దానయ్యలనడిగి లాభం లేదని ఇళ్లల్లో మూలనున్న ముసలమ్మల్ని, అయ్యల్ని అడిగారు. చాలా ఏళ్లు పైబడ్డం వల్ల వాటి బరువుకి వంగిపోయిన వాళ్లు, అప్పుడెప్పుడో చిత్రాల్లో కనిపించే చెరువుల్ని చూశామని, కడుపునిండా నీళ్లు తాగామని చెప్పారు. కొందరు ఆ చెరువుల్లో ఈదులాడామని ‘ఫ్లాష్‌బ్యాక్‌’ స్టోరీలు కూడా చెప్పారు. కానీ ఒక్కళ్లంటే ఒక్కళ్లు కూడా ఇప్పుడా చెరువులు ఎక్కడున్నాయో చెప్పలేకపోయారు.
చెరువుల జాడే తెలియకపోతే చేపలు ఎక్కడ దొరికేను, చేపలు చిక్కకపోతే రాజెవ్వడయ్యేను అని చింతించిన రాకుమారులకు చిట్టడవిలో ఒంటిమీద గోచీ, ఒంటికి బూడిదా వున్న ఓ గోసాయి కన్పించాడు. చుట్టూ మూగిన వారిని ఓదార్చాడు. నగరంలో ఉండాల్సిన చెరువులు, మాయమైన చెరువులు ఎక్కడ ఉన్నదీ తన దివ్యదృష్టితో కనిపెట్టి చెప్పాడు.
కనిపించకుండా పోయిన ఏడు చెరువుల్లో రెండు రాజుగారి కోటకిందే వున్నాయని, ఒకటి ప్రధాన అమాత్యుల వారి లంకంత కొంపకింద వున్నదని, మిగిలిన నాలుగు చెరువుల మీద రాజప్రతినిధుల భవనాలు, శ్రీమంతుల మిద్దెలూ మేడలూ వున్నాయని, అందువల్ల మాయమైన చెరువులు ఎక్కడా కనిపించనే కనిపించవని గోసాయి వివరంగా చెప్పాడు.
చెరువుల్ని చెరపట్టిన వారంతా సిరిసంపదలు, పేరు ప్రఖ్యాతులున్నవారే. చెరువుల్ని చెర విడిపించడానికి భవనాలను నేటమట్టం చేసినా ఆ చెరువులు మళ్లీ గలగలమని జలజలమని అంటాయా? వాటిలో చేపలు మళ్లీ గంతులు వేస్తాయా? వలకు చిక్కుతాయా? ఏడుగురిలో ఒడు రాజవుతాడా? అన్న ్రశ్నలు ఏడుగురు రాకుమారుల్ని ఏడిపించసాగాయి.
ఏడుగురూ వెళ్లి రాజావారితో చెరువులన్నీ జాడ లేకుండా పోయినవని, రాజావారి మంచం కింద కూడా ఓ చెరువు శాశ్వత నిద్రలో వుందని చెప్పారు. చెప్పక ఇంకేం చేస్తారు? ఇది విన్న రాజావారు, ఏడుగురు కొడుకులూ హ్యాపీ జర్నీ చెప్పకముందే, కాబోయే రాజావారి పేరు అనౌన్సు చెయ్యకముందే సైలెంటయి పోయారు.

– చింతపట్ల సుదర్శన్‌, 9299809212