– ఆయనకు సముచిత స్థానం కల్పిస్తాం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సోమవారం జనగామలో నిర్వహించబోయే బహిరంగ సభలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్‌కు పొన్నాల రాజీనామా చేసిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెళ్లారు. తమ పార్టీలోకి రావాలంటూ ఆయన పొన్నాలను ఆహ్వానించారు. అలా వస్తే సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీనిచ్చారు. భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్లోకి ఆహ్వానించామని తెలిపారు. బలహీనవర్గాలకు చెందిన అనేక మంది నాయకులకు కేసీఆర్ ఎంతో ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి.. నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంజినీర్‌గా పనిచేసిన వ్యక్తి పొన్నాల అని కితాబిచ్చారు. పార్టీలో సీనియర్లుగా ఉండి, ఎంతో అనుభవం గడించిన నేతలకు సైతం పీసీసీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం శోచనీయమని అన్నారు. వయసులో పెద్దవారైన పొన్నాలను పట్టుకుని రేవంత్ తూలనాడటం సరికాదన్నారు. ఎన్నో పార్టీలు మారిన ఆయన… ఇప్పుడు నీతి సూక్తులు చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మంత్రి కేటీఆర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, సీనియర్ నేత దాసోజు శ్రావణ్ తదితరులున్నారు.