హరీశ్‌ను విమర్శించే స్థాయి పొన్నంకు లేదు

– మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైతు రుణమాఫీకి సంబంధించి మాజీ మంత్రి హరీశ్‌రావును విమర్శించే స్థాయి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేదని మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పక్షాన మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడితే పొన్నం సహా మంత్రులు పిచ్చి కూతలు కూస్తున్నారనీ, కేవలం వార్తాపత్రికల్లో హెడ్‌లైన్లలో ఉండేందుకు వారలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.31 వేల కోటతో రుణమాఫీ అని, రూ.18 వేల కోట్లకే సరిపెట్టేలా ఉన్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ కాల్‌సెంటర్‌కు రుణమాఫీపై ఇప్పటికే 75 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పంద్రాగస్టున మూడో విడత రుణ మాఫీ అంటున్నారనీ, ఆ విడత తర్వాత సీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంటుందని విమర్శించారు. సమావేశంలో డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు.