నవ తెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామంలోని బిసి కాలనిలో మెట్టు రాజయ్య ఇంటి నుంచి గానవేన చిన రాజయ్య ఇంటి వరకు దాదాపు 120 మీటర్ల మేర రూ.1.60 లక్షల గ్రామపంచాయితీ నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు.పనులు చేపట్టిన గుత్తేదారు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా అస్తవ్యస్తంగా చేపట్టినట్లుగా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పనుల్లో నాణ్యమైన సిమెంట్, కంకర,ఇసుక ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం వాడాల్సినంతగా వాడకుండా తూతుమంత్రంగా పనులు చేపట్టడం జరిగిందని వాపోతున్నారు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టిన నుంచి వాటర్ క్యూరింగ్ సకాలంలో చేపట్టకపోవడంతో డ్రైనేజీ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పగుళ్లు తెలుతున్నట్లుగా స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.డ్రైనేజీ అడుగు భాగంలో కంకరతో ఫిక్సింగ్ చేయకుండా సిమెంట్,ఇసుక అదికూడా నామమాత్రంగా వేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.పనులపై పర్యవేక్షణ చేయాల్సిన పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు ఆటువైపు కన్నెత్తి చూడలేదు. కారణం గుత్తేదారు ఇచ్చే అమ్యామ్యాలకు తలొగ్గడమేని తెలుస్తోంది. పది కాలాలపాటు అగాల్సిన డ్రైనేజీ మూణ్నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా నగునూరి రాజారాం అనే ఇంటి యజమాని డ్రైనేజీపై ప్రహరీ గోడ పెట్టిన గ్రామ ప్రత్యేక అధికారి,పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం.ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

– అడప రాజు, వళ్లెంకుంట గ్రామస్తుడు
డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా నిర్వహించారు. పనులు జరిగినప్పుడు సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లేదు.నాణ్యతగా చేపట్టాలని మిల్లర్ పనులు చేసేవారిని నిలదీస్తే మీరు ఎక్కడైనా చెప్పండి ఇలాగే చేస్తామని దురుసుగా మాట్లాడారు.
గోడ పెట్టండి మహాప్రభో…అడప మదునమ్మ స్థానిక వృద్ధురాలు
డ్రైనేజీ నిర్మాణ పనుల్లో భాగంగా నా ఇంటి గోడ అడ్డుగా ఉందని తొలగించారు.డ్రైనేజీకి గోడకు సంబంధం లేదు.నాకు దిక్కుమొక్కు లేదు.కూల్సిన గోడ వెంటనే పెట్టాలి.