పూవమ్మ పునరాగమనం

– ముందుగానే ముగిసిన రెండేండ్ల సస్పెన్షన్‌
న్యూఢిల్లీ :భారత సీనియర్‌ స్ప్రింటర్‌ మాచెట్ట రాజు పూవమ్మ మళ్లీ ట్రాక్‌పై పునరాగమనం చేసింది. శ్రీలంక జాతీయ చాంపియన్‌షిప్స్‌లో మహిళల 400 మీటర్ల రేసులో పూవమ్మ పోటీ పడింది. 56.20 సెకండ్లతో ఏడో స్థానంలో నిలిచిన ఎం.ఆర్‌ పూవమ్మ ట్రాక్‌పై పతకం సాధించకపోయినా.. ట్రాక్‌ బయట సరికొత్త చర్చకు తెరతీసింది. గతంలో డోపింగ్‌లో పట్టుబడిన పూవమ్మపై డోపింగ్‌ వ్యతిరేక క్రమశిక్షణ ప్యానెల్‌ (ఏడీడీపీ) గత ఏడాది జూన్‌లో మూడు నెలల నిషేధం విధించింది. ఏడీడీపీ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లిన నాడా (నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ) యాంటీ డోపింగ్‌ అప్పీల్‌ ప్యానల్‌ (ఏడీఏపీ)లో పూవమ్మకు రెండేండ్ల సస్పెన్షన్‌ విధించేలా చేసింది. దీంతో పూవమ్మ రెండేండ్ల నిషేధం జూన్‌ 15, 2024న ముగియాల్సి ఉంది. కానీ తాజాగా పూవమ్మ శ్రీలంక జాతీయ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడటంతో అందరి దృష్టి నిషేధం కాలం తగ్గటంపైనే పడింది. ఏడీఏపీలో పూవమ్మకు రెండేండ్ల నిషేధం విధించినా.. సస్పెన్షన్‌ కాలాన్ని శాంపిల్‌ సేకరించిన తేది నుంచి (18 ఫిబ్రవరి 2021) అమలు చేసింది. దీంతో నిషేధం ఈ ఏడాది ఫిబ్రవరి 17తోనే ముగిసింది. ఈ విషయంపై నాడా నుంచి భారత అథ్లెటిక్‌ సమాఖ్యకు లేఖ సైతం అందింది. ఏడీఏపీ, ఏడీడీపీలను సంప్రదించకుండా నాడా ఏకపక్షంగా పూవమ్మ సస్పెన్షన్‌ కాలాన్ని ఏడాది ముందు నుంచి అమలు చేయటంపై ప్రస్తుతం విమర్శలు వినిపిస్తున్నాయి.