ఇండ్ల స్థలాల్లో పేదలకు పొజిషన్‌ చూపాలి

ఇండ్ల స్థలాల్లో పేదలకు పొజిషన్‌ చూపాలి– రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డిని కలిసిన జగ్గారెడ్డి
–  వెంటనే ఇవ్వాలని కలెక్టర్‌కు చెప్పిన మంత్రి
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలోని అలియా బాద్‌, సదాశివపేట మండలం లోని సిద్దాపూర్‌లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు గతంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలకు పొజిషన్‌ చూపాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మంత్రిని కోరారు. శనివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని గాంధీ భవన్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పేదల ఇండ్ల స్థలాల సమస్య గురించి చర్చించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తాను జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా అలియాబాద్‌లోని ప్రభుత్వ భూమిలో 4 వేల మంది పేదల్ని గుర్తించి ఇండ్ల స్థలాలు కేటాయించి లేఅవుట్‌ చేసి పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేసినట్టు మంత్రి దృష్టికి తెచ్చారు. అదే విధంగా సదాశివపేట మండలంలోని సిద్దాపూర్‌లో కూడా 5 వేల మందికి ఇండ్ల స్థలాలిచ్చామని గుర్తు చేశారు. పేదలకు పంపిణీ చేసిన భూమి అలాగే ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ తొమ్మిదేండ్ల పాలనలో వారికి పొజిషన్‌ చూపలేదని తెలిపారు. పైగా పేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని గత ప్రభుత్వం తొలగించిందన్నారు. దీంతో ఇండ్ల స్థలాలున్నప్పటికీ పేద ప్రజలు ఇండ్లు కట్టుకోలేకపోతున్నారని గుర్తు చేశారు. రెవెన్యూ మంత్రిగా జోక్యం చేసుకుని వెంటనే పేదలకు ఇండ్ల స్థలాల్లో పొజిషన్‌ చూపాలని కోరారు. జగ్గారెడ్డి ఇచ్చిన వినతి పత్రాని పరిశీలించి సానుకూలంగా స్పందించిన రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతికి ఫోన్‌ చేసి మాట్లాడారు. వెంటనే పేదలకు పొజిషన్‌ ఇవ్వాలని ఆదేశించారు.
నాడు ఏతులు…నేడు నీతులు? :హరీశ్‌రావుపై జగ్గారెడ్డి ఆగ్రహం
బీఆర్‌ఎస్‌ హయాంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారంలోకి ఉన్న కాలంలో ఏతులు మాట్లాడే వారనీ, ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు అని విమర్శించారు. సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నీటిపారుదల శాఖపై సమీక్షలు నిర్వహిస్తుంటే, హరీశ్‌కు నిద్ర పట్టడంలేదన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2018 ఎన్నికల్లో గెలిస్తే సీఎం అయ్యేందుకు హరీశ్‌రావు రూ5వేల కోట్లు సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. తన వద్ద ఆ సమాచారం ఉందన్నారు. ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారో బయటపెట్టాలంటూ సీఎంకు లేఖ రాయనున్నట్టు తెలిపారు.