– డా.జి విజయ కృష్ణ, శాస్త్రవేత్త (ఉద్యాన)
మామిడిలో చాలా రకాలు. ఏటా ఒక వంటను మాత్రమేనిస్తాయి.కాయ కోత అనంతరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మామిడి రైతులు పాటించిన సాగు పద్ధతులను బట్టి నవంబర్ నెల నుంచి ముదిరిన రెమ్మల లో పూ మొగ్గలు ఏర్పడ తాయి, రకాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి సాధారణంగా డిసెంబర్ రెండో వారం నుంచి జనవరి మధ్య వరకు పూ మొగ్గలు రావటం మొదలవుతుంది.అయితే ప్రస్తుతం వాతావరణంలో కలిగే మార్పుల వల్ల పూత రావడం క్రమపద్ధతిలో జరగడం లేదు. కాబట్టి రైతులు ఈ మార్పులకు అనుగుణంగా యాజమాన్యం పద్దతులు మార్చుకోవాల్సి ఉంటుంది.
కాయ కోత అనంతరం చేపట్టే యాజమాన్య పద్ధతులపై కాయల దిగుబడి,నాణ్యత ఆధారపడి ఉంటుంది.కాయలు కోసిన అనంతరం పూత దశ వరకు కొమ్మ కత్తిరింపులు, అంతర సేద్యం,ఎరువుల యాజమాన్యం,నీటి యాజమాన్యం,సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.
ఏ పంటలో నైనా ఆకులు మాత్రమే సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగ క్రియ జరపగలిగి ఉంటాయి.ఈ చర్య ద్వారా చెట్టుకు అవసరమైన ఆహార పదార్థాలు తయారై శ్వాసక్రియ ద్వారా శక్తిగా మారి పెరుగుదలకు,పుష్పించేందుకు, కాయలు వృద్ధి చేసేందుకు తోడ్పడతాయి.మనం అందించే ఎరువు ద్వారా మామిడి చెట్టు బాగా పెరిగి పచ్చదనం కలిగి గుబురుగా ఉన్న కొమ్మలు, ఆకులతో ఉం టుంది.ఇలాంటి చెట్లకు అధ్యయనం వేయగా, చివరనున్న ఆకుల విస్తీర్ణానికి అనగా 15% విస్తీర్ణానికి మాత్రమే పూర్తిగా తగినంత సూర్యరశ్మి సోకుతున్నట్లు, మిగిలిన 85% ఆకుల విస్తీర్ణం వివిధ స్థాయిల్లో నీడల్లో ఉన్నట్లు తెలిసింది.ఈ పరిస్థితుల్లో చెట్టు తమకున్న ఆహార పదార్థాల తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా విని యోగించుకోలేవు.దీనివల్ల ఆహార పదార్థాల ఉత్పత్తి బాగా తగ్గి దిగుబడులు పై తీవ్ర ప్రభావం చూపించడం వల్ల దిగుబడులు తగ్గుతాయి.నీడ పడటం వల్ల మామిడి ఆకులలో ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం చాలా తగ్గు తుంది. ఆకులు గుబురుగా ఉన్నప్పుడు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది.
కొమ్మల కత్తిరింపులు:
– కొమ్మల కత్తిరింపు ప్రారంభించి జూన్ – జూలై మధ్యలో పలు కత్తిరింపులు పూర్తి చేయాలి.
– అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, తెగులు సోకి ఎండిన కొమ్మలు పూర్తిగా కత్తిరించి తొలగించాలి.
– అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, తెగులు సోకి ఎండిన కొమ్మలు పూర్తిగా కత్తిరించి తొలగించాలి.
– వ్యవసాయ పనులకు అడ్డంగా లేకుండా నేలపై వేలాడే కొమ్మలను మొదటికి కత్తిరించి తొలగించాలి.
– ఎండిన పూత కాడలు(కొరడాలు) ద్వారా తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంటుంది. వీటిని వర్షాకాలం రాకముందే తొలగించాలి.
– తలపైన మూడు నాలుగు అంగుళాల మంద మున్న కొమ్మను కోసి (కత్తిరించి) ఖాళీ ఏర్పరచాలి.
– ఇలా చేసినప్పుడు మధ్యాహ్నం వేళ ఎండ మొదలు పై పడి,లోపలికి ప్రసరించి ఆకులకుసోకాలి.
– అవసరమైతే తూర్పు పడమర దిశల్లో కూడా 2 – 3 అంగుళాల మంద మున్న కొమ్మలను కత్తిరించి కొమ్మల మధ్యలో ఖాళీలు ఏర్పడేలా చేసి సూర్యుడు తూర్పున ఉదయించి పడమటి దిశ వరకు ప్రయాణించేటప్పుడు సూర్యరశ్మి ఈ ఖాళీల ద్వారా ఆ చెట్టు లోనికి ప్రసరిస్తుంది.
కొమ్మల కత్తిరింపులు చేసినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:
– కొమ్మలను రూపముతో కత్తిరించవలెను.పెద్ద కొమ్మలు (20 సెం.మీ. వ్యాసం)
– కత్తిరించుటకు మోటారు (పెట్రోల్) తో నడిచే రూపమును ఉపయోగించవలెను.
– కొమ్మలను వాలుగా కత్తిరింపు చేయ వలెను,కత్తిరింపు చేయునప్పుడు కొమ్మ క్రింద భాగం చీల కుండా జాగ్రత్త తీసుకోవాలి.కొమ్మలు కత్తిరింపు చేసిన తర్వాత బోర్డ్ పేస్టును పూయవలెను.చిన్నచిన్న కొమ్మలను చేతి ద్వారా కత్తిరింపు చేసే సికేచర్ (లాంగ్రీ చ్పూసర్) ద్వారా కత్తిరింపులు చేయవలెను. సన్న పాటి కొమ్మలను కత్తిరించేటప్పుడు చిన్నపాటి సికేచర్ ఉపయోగించవలెను.
అంతర సేద్యం:
– కాయల కోత తర్వాత తోటల్లో పడి ఉన్న టెంకెలు ను,ఎండు పుల్లలను ఏరి కాల్చి వేయాలి.
– జులై నెలలో వర్షాలు కురవగానే దున్న కాలు ప్రారంభించాలి. 2-3 సార్లు దున్ని చెట్ల మధ్యలో, చెట్ల కింద కలుపు మొక్కలు లేకుండా చేయాలి.చెట్ల కింద దున్న కాలు చేయించే వీలు లేకుంటే పారలుతో కుళ్ళగించాలి. దున్న కాలు చేయటం వల్ల కలుపు మొక్కలు తొలగించబడతాయి.నేల గుల్ల బారి తోటలో పడిన వర్షం నీరు తోటలోనే ఇంకు తుంది. నేలలో ఉండే పురుగులు కోశస్థ దశలో పిల్ల పురుగులు బయటపడి పక్షులు తిన్నందున, ఎండకు, గాలికి చనిపోతాయి. దున్న కాలు సెప్టెంబర్ లో పూర్తిచేయాలి.
మే – జూన్ నెలల్లో కాయలు కోసిన అనంతరం 15 – 20 రోజులు చెట్లకు విశ్రాంతినివ్వాలి.వేసవిలో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని కాయల వృద్ధికి ఆహారాన్ని తయారు చేసి అందించినందుకు కొంతవరకు చెట్లు నిర్వీర్యం మై ఉంటాయి. విశ్రాంతిని స్తే కొంత బలాన్ని పుంజుకుంటాయి. విశ్రాంతి నిచ్చిన తర్వాత అక్టోబర్ నవంబర్ నెలలో కొమ్మల కత్తిరింపులు,దుక్కులు చేయడం,ఎరువులు వేయడం, నీరు పారించడం చేయకూడదు ఎందుకంటే మన ప్రాంతాల్లో ఈ నెలలో కొమ్మల్లో మొగ్గలు ఏర్పడి పూ మొగ్గలు గా,శాకీయ మొగ్గలు గా మారుతాయి.ఈ నెలలో చేస్తే శాకీయ మొగ్గలు గా మారే అవకాశం ఎక్కువ ఉంటుంది.
– కలుపు మొక్కలు ఎక్కువగా వృద్ధి చెంది తప్పక దున్న కాలు చేయవలసిన అవసరం ఏర్పడితే లోతుగా దున్న కుండా రోటోవేటరు లాంటి వాటితో వరుసల మధ్య మాత్రమే దున్నాలి.
ఎరువుల యాజమాన్యం:
– జూలైలో చెట్ల పాదుల్లో పడిన ఎండిన మామిడి ఆకుల్ని పాదుల్లో నేలలో కలిసేలా మొదలు దగ్గరకు కల్టివేటరు లేదా రోటవేటరు పోయేలా దున్నాలి.ఈ ఆకులు కొన్ని రోజులకు కుళ్ళి సేంద్రియ పదార్ధంగా మారి చెట్లకు సత్తువ నిస్తాయి.
– జూలై- ఆగస్టు నెలలో చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు వేయాలి.ఈ నెలలోనే జనుము, జీలుగ, పెసర, పిల్లి పెసర, అలసంద లాంటి పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి పూత దశలోనే నేలలో కలియ దున్నాలి. ఎరువులను చెట్టు మొదలు కు 3 – 4 అడుగుల దూరంలో చేసిన గాడిలో వేసి కప్పాలి.
– జింకు,ఇనుము,బోరాన్ లోపాలు సాధారణంగా కనిపిస్తాయి. వీటి లోప నివారణకు సేంద్రియ రూపంలో దొరికే ఫార్ములా 4 పొడిని లీ. నీటికి 5 గ్రాములు చొప్పున కలిపి 20 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
నీటి యాజమాన్యం:
మామిడి కాయల కోత అనంతరం నీటి పారుదల సౌకర్యం మున్న తోటలకు నీటి తడులు కొనసాగించాలి.కురిసే వర్షాల్ని బట్టి సెప్టెంబర్ ఆఖరి వరకు నీరు పారించాలి. అక్టోబర్ నవంబర్ నెలలో నీరు పారించకుండా చెట్లను బెట్టు కు గురి చేస్తే పూత బాగా వచ్చే అవకాశం ఉంటుంది. డిసెంబర్ మధ్యలో ఒక తేలికపాటి తడిస్తే పూత తొందరగా ఒకేసారి వచ్చేందుకు దోహదపడుతుంది. పిందెలు ఏర్పడినప్పటి నుంచి నీటి పారుదల ప్రారంభించాలి.
సస్యరక్షణ:
కాండం బెరడు తొలుచు పురుగుల్ని గమనిస్తే ఇవి నవవరిచిన బెరుడును తొలగించి రంధ్రంలోని రంపపు పొట్టు లాంటి బయటకు లాగి చంపాలి. రంధ్రంలో ఉండే పిల్ల పురుగులు లోపలే చనిపోవడానికి క్లోరిపైరిఫాన్ 10మి.లీ. మందును 10 మి.లీ. నీటికి కలిపిన ద్రావణం వేసి బంకమట్టితో ముయ్యాలి. తేనె మంచు పురుగు తల్లి, పిల్ల పురుగులు చేరి లేత ఆకులు, పుష్పగుచ్చాలు, పూలు మరియు పిందెల నుండి రసాన్ని పీలుస్తాయి. దీనివలన పూత పిందే వాడి,రాలిపోతాయి. అంతే కాకుండా ఈ పురుగులు విసర్జించిన తేనె లాంటి తీయని పదార్ధం పై మసి కారణమైన శిలీంద్రాలు పెరుగుతాయి. దీనివలన ఆకు పై పూత మరియు కాయల పై నల్లని మసి మంగు ఏర్పడుతుంది. దీని నివారణకు లీ నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి పూత మొదలయ్యే సమయంలో మరియు పిందెలు తయారయ్యే సమయంలో పిచికారి చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేయడం వలన పుప్పొడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గదశలో కనిపించిన ఎడల ఇమిడాక్లోప్రిడ్ 1మి.లీ. 3 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
– ఆకు గూడు పురుగులు చేసిన గూళ్ళను కట్టె తో చెదరగొట్టి క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. మందును లీ. నీటికి కలిపి జూలై ఆగస్టు నెలలో పిచికారీ చేయాలి. మామిడి కోతల తర్వాత పైన తెలిపిన యాజమాన్యం పాటించి నట్లయితే మామిడిలో నాణ్యమైన, అధిక దిగుబడి పొందవచ్చు.
– ఉద్యాన పరిశోధనా స్థానం, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోన్: 9701445744, 8187804025.