– సీఈవోకు అభ్యర్థుల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పోలింగ్ రోజు ఈనెల 27న రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎన్నికల కమిషన్ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి గురువారం లేఖ రాసింది. అభ్యర్థుల ఫిర్యాదు మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజు టెట్ రాతపరీక్షను వాయిదా వేయాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది ఉన్నారు. ఈనెల 20 నుంచి జూన్ మూడో తేదీ వరకు టెట్ రాతపరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. అయితే ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, వచ్చేనెల నాలుగున సాధారణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈనెల 27న, వచ్చేనెల మూడున జరిగే టెట్ రాతపరీక్షల తేదీల్లో మార్పు చేయాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. టెట్ రాతపరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనుంది