పోస్టులు 36.. అభ్యర్థులు 2 వేలు…

– ఆర్థికశాఖ ఆమోదించినా నోటిఫికేషన్‌ రాని వైనం
– ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌లో పరిస్థితి ఇదీ
– అభ్యర్థుల్లో ఆందోళన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆయుష్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో ఈ పోస్టులకు అర్హులైన వారు 2000 మంది ఉన్నారు. గత 12 ఏండ్లుగా పోస్టులు లేకపోవడంతో వీటి భర్తీపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే 36 ఆయుష్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ కోసం ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీంతో వైద్యారోగ్యశాఖ నుంచి నోటిఫికేషన్‌ వస్తుందని భావించిన అభ్యర్థులకు నిరాశే ఎదురవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్‌ వస్తుందని వైద్యారోగ్యశాఖలో ఉన్నతాధికారులు చెబుతు న్నప్పటికీ…ఇంతకాలం ఎందుకు ఆపుతున్నారనేది అర్థం కావడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాల అర్హత వయస్సును బీఆర్‌ఎస్‌ సర్కారు పదేండ్లు సడలించినా, కాంగ్రెస్‌ సర్కారు రెండేండ్లు సడలించినా వీరికి మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్న రెండు ఆయుర్వేద కాలేజీల్లో సరైన టీచింగ్‌ ఫాకల్టీ లేక ప్రతి సంవత్సరం కండిషనల్‌ పర్మిషన్‌ మీద నెట్టుకొస్తున్నారు. మెడికల్‌ ఆఫీసర్లను డిప్యూటేషన్‌ మీద వాడుకొంటూ రికార్డుల్లో వారిని ఫాకల్టీ క్రింద చూపిస్తూ వైద్య విద్యను నడిపిస్తున్నారు. దీంతో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న చోట రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు .ఎక్కువ కాలం కాంట్రాక్టు, డిప్యూ టేషన్‌తో వైద్యవిద్యలో నాణ్యత లోపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య నియామకాల కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు ఇతర వైద్యవ్యవస్థల్లో నియామకాలు చేపట్టినా ఆయుర్వేదంలో మాత్రం ఒక్క రెగ్యులర్‌ నియామకం చేపట్టకపోవడం గమనార్హం. రెగ్యులర్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు పదే పదే గత, ప్రస్తుత ప్రభుత్వాల చుట్టు తిరుగుతున్నారు. గతంలో వైద్యారోగ్యశాఖ మంత్రులుగా పని చేసిన వారితో పాటు ప్రస్తుత వైద్యారోగ్యశాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. ఆయుర్వేద విద్యలో పీజీ పూర్తి చేసిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 12 ఏండ్ల నుంచి నేరుగా నియామకాలు చేపట్టలేదు. 2008లో పోస్టుల భర్తీ కోసం పీజీలు అందుబాటులో లేరనే కారణంతో వన్‌ టైం ఆప్షన్‌ కింద అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నాన్‌-టీచింగ్‌ సైడ్‌ నుంచి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ డిప్యూటేషన్‌ అక్కడితో ఆగకుండా మరో రెండు సార్లు అదే విధంగా డిప్యూటేషన్‌ను 2010, 2012లో ప్రభుత్వం పొడిగించింది. అయితే మరోసారి అలాంటి ప్రయత్నం చేయకుండా ఆశావహ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిం చడంతో పొడిగింపు ఆగిపోయింది. దీంతో ఆ 36 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను రెండేండ్ల క్రితం కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేశారు. నాణ్యమైన విద్యనందించేందుకు ఇప్పటికైనా నేరుగా పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే వయోపరిమితి దాటుతుండటంతో వీరిలో చాలా మంది అభ్యర్థులకు మరోసారి ఎంపికయ్యేందుకు కూడా అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.