– ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు, అర్బన్ మండలాలు, అర్బన్ రెవెన్యూ డివిజన్లకు విద్యాధికారుల పోస్టులను మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాలకు డీఈవో, 28 డిప్యూటీ విద్యాధికారి (డిప్యూటీఈవో), 59 మండల విద్యాధికారి (ఎంఈవో), ఐదు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శికి ఈ ఏడాది ఫిబ్రవరి 12న లేఖ రాశానని గుర్తు చేశారు. ఏడు నెలలు పూర్తవుతున్నా ఇంత వరకు ఆ పోస్టులను మంజూరు చేయలేదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల పర్యవేక్షణ లోపించి పాఠశాలల నిర్వహణలో లోపం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పంపించిన ప్రతిపాదనల్లో పాఠశాలల సంఖ్య, విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా రెవెన్యూ మండలాలు, డివిజన్ల ప్రాతిపదికన ఎంఈవో, డిప్యూటీఈవో పోస్టులను ప్రతిపాదించారని తెలిపారు. అర్బన్ మండలాల్లో పాఠశాలల సంఖ్య, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుందని వివరించారు. అర్బన్ మండలాలకు ఒకటి కంటే ఎక్కువ ఎంఈవో పోస్టులను ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. అర్బన్ రెవెన్యూ డివిజనర్లకు కూడా ఒకటి కంటే ఎక్కువ డిప్యూటీ ఈవో పోస్టులను ఇవ్వాలని కోరారు. అర్బన్ మండలాలు, డివిజనర్లకు అవసరమైన ఎంఈవో, డిప్యూటీ ఈవో పోస్టులను అదనంగా లెక్కించి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్నందున ఆ పోస్టులను వెంటనే మంజూరు చేయాలంటూ బుధవారం లేఖ ఇచ్చానని పేర్కొన్నారు.