– ప్రభుత్వ ఉద్యోగులతో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రహస్య సమావేశం
– ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు
– 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
నవతెలంగాణ-సిద్దిపేట/సిద్దిపేట కలెక్టరేట్
సార్ పిలిచాడని సమావేశానికి పోతే.. 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ వార్త ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటలో ఐదేండ్లకు పైగా కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం విదితమే. ఎన్నికల ప్రచార సన్నాహాల్లో భాగంగా.. సిద్దిపేట జిల్లాకు చెందిన కొంతమంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులతో పట్టణంలోని రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఇటీవల ఆయన రహస్యంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రచారంలోగానీ, సమావేశాల్లోగానీ ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు .. కానీ గతంలో జిల్లాలో పనిచేసిన పెద్ద సారు పిలిచాడని.. ఎన్నికల సమావేశాలకు పోవద్దని తెలిసి కూడా సారుపై గౌరవంతో ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు.. అనుమతులు లేకుండా, రహస్యంగా ప్రభుత్వ ఉద్యోగులతో ఎంపీ అభ్యర్థి సమావేశం నిర్వహించారని ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. ఉద్యోగులు పారిపోకుండా గేటుకు తాళం కూడా వేశారు. విషయం తెలుసుకున్న ఉద్యోగులు కొంతమంది గేటు దూకి పారిపోయారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడికి వచ్చి పరిశీలించారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అంతేకాకుండా, వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కలెక్టర్‌ను కలిశారు. దాంతో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సారు పిలిచాడని ఆయనపై గౌరవంతో సమావేశానికి పోతే సస్పెండ్ అయ్యామని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
సస్పెండ్ అయిన వారు..
సస్పెండ్ అయిన వారిలో సెర్ఫ్ ఉద్యోగులు 38 మంది.. వారిలో ఏపీఎంలు-14, సీసీలు-18, వీవోఏలు-4, సిఓ-1, సిబి ఆడిటర్స్-1, అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగుల్లో ఏపీవోలు-4, ఈసీలు -7, టిఏలు-38, సిఓలు-18, ఎఫ్‌ఎ-1 ఉన్నారు.