పొట్టోనికి పుట్టెడు బుద్దులు

పొట్టోనికి పుట్టెడు బుద్దులుపొట్టి పొడుగు బక్కగ దొడ్డుగ ఇవన్నీ దేహ తత్వాన్ని బట్టి వుంటయి. వాటిని బట్టి మనిషి ఆలోచనలు ఏమీ వుండవు గానీ, మనిషి గుర్తు పట్టడానికి, పోలిక చెప్పడానికి పొట్టిగ బక్కగ అని చెబుతుంటరు. జర పొట్టిగున్న వాల్లు ఉపాయవంతులైతే ‘పొట్టోనికి పుట్టెడు బుద్దులు’ అంటరు. అట్లని అందరు పొట్టోల్లు అంత బుద్దిమంతులు కాకపోవచ్చును. అట్లనే ఆడవాల్లనైతే ‘పొట్టిదైనా గట్టిదే’ అనే సామెతను అవలీలగా వాడుతుంటరు. నిజానికి ఈ సామెతకు ఇంకోటి కలిపి వాడుతరు. అట్లనే బక్కగా ఉన్నోల్లు కొంతమంది వుంటరు. బగ్గ దొడ్డుగ మరికొంతమంది వుంటరు. బక్కగ ఉన్నవాల్లకు బలం లేదు అనుకుంటరు. కానీ బక్క మనిషి ఏదైనా వస్తువు ఎత్తి లావట్టంగనే ‘బక్కోనికి బొక్కల బలం’ అంటు అభినందనపూర్వక సామెతను వాడుతుంటరు. అందరు అన్నం సమానమే తింటరు. కొందరు వాల్ల శరీరంలోని మెటబాలిజం ప్రకారం దేహం ఆకారం రూపొందుతది. అందుకే మనిషి బక్కగ వుంటే మరింత ఆక్టివ్‌గా వుంటరు. జర దొడ్డు వుంటే పర్వాలేదు కానీ మరీ కింటాల్‌ బరువు అయితే తనకు తాను మోసుక పోవుడే తిప్పలుంటది. అటువంటి వాల్లను ఆయన లేని సమయంలో ‘బర్రెకు బర్రెకు ఉన్న మనిషి’ అనుకుంటె బర్రె మల్లయ్య, బర్రె వెంకయ్య అంటరు. ఇట్ల అనేవాల్లను ‘పేర్నాల పెట్టెటోడు’ అంటరు. పొట్టోల్లు పొడుగోల్ల మీద మరో సామెత ఉన్నది. ‘పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే వాని నెత్తి పోషమ్మ కొడుతది’ అంటరు. అంటే ఒకరిని ఒకరు మోసం చేస్తే వాల్లను పోషవ్వ తల్లి సూసుకుంటది అనే అర్ధంలో వాడుతుంటరు. అట్లనే ‘పొట్టి గట్టి పొడుగు లొడుగు’ అని సుత అంటరు. లొడుగు అంటే లొడాస్‌ లొడాస్‌ అన్నట్టు. లూజ్‌ లూజ్‌ అని అర్ధంలో వాడుతరు. ఇగ దొడ్డుగ ఉన్నవాల్ల చేతులు కూడా మెత్తగ ఉంటయి. అట్లనే మరి కొందరి చేతులు గట్టిగ ఉంటయి. కొందరు ఫారం కోళ్ల లెక్క పెరుగుతరు. మరి కొందరు నాటు కోళ్ల లెక్క పెరుగుతరు. సామెతల్లో శాస్త్రీయత లేకపోవచ్చు గానీ ఎంతో కొంత వ్యక్తిత్వాన్ని తెలుపుతయి.
– అన్నవరం దేవేందర్‌, 9440763479