ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలుగా సంక్షేమంతో కూడిన కార్యక్రమాలతో పాటుగా ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య విభాగాలలో ఒక సమానమైన కోణం ప్రధానమైనది. ముఖ్యంగా బాల కార్మికుల వ్యవస్థ అనేక అంశాలపై ఆధారపడి ఉంది. ఇది తీవ్రమైన మానవ హక్కుల సమస్య. ఒకవైపు పేదరికం వెంటాడటం, మరోవైపు ఆర్థిక సమస్యలు దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బాల కార్మికుడు అన్న దానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనం ”బాల్యాన్ని నాశనం చేసే రీతిలో బాలుడు లేదా బాలిక పనిచేయడం”. బాలల శారీరక, మానసిక అభివృద్ధికి ఆటంకమై వారికి కనీస అక్షరాస్యతను, వినోదాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇవ్వని పనిని, స్థితిని బాలకార్మిక వ్యవస్థ అంటారు. పాఠశాలల్లో విద్య అభ్యసించే రోజులతో అక్షర జ్ఞానానికి నోచుకోకుండా భారమైన శ్రమకు బలైపోతున్న బాలల జీవితాలు మనం సాధించిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాయి. ఇది అత్యంత బాధాకరమైన పరిస్థితి. ఒకరకంగా నాగరికతకే తలవంపుగా పరిణమించాయి. బాలకార్మిక వ్యవస్థ ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బాలకార్మికులు తారసపడక తప్పదు.
ప్రపంచ వ్యాప్తంగా 2000 నాటికి 24కోట్ల60లక్షల బాలకార్మికులు ఉంటే 2012 ముగిసేనాటికి 16కోట్ల 80లక్షల మంది ఉన్నారు. మొత్తం బాలబాలికల జనాభాలో 11 శాతం మంది బాలకార్మికులే. పేద దేశాల్లో ఇది ఎక్కువగా నమోదవుతున్నది. అయితే జనాభా పరంగా చూస్తే అత్యధిక శాతం అధిక జనాభా కలిగిన దేశాలలో గమనించవచ్చు. గత 12 ఏళ్లలో 7కోట్ల80లక్షల మంది బాల కార్మికులు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయినా 8కోట్ల 50 లక్షలు అంటే 5.4 శాతం మంది ఇంకా ప్రమాదకర పనుల్లో మగ్గుతున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది ఆసియా, పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నారు. అందులో వ్యవసాయ రంగంలోనే అధికంగా 9కోట్ల 80 లక్షల మంది బాల కార్మికులున్నారు. అంటే మొత్తం బాలకార్మికుల్లో 59 శాతం వాటా వ్యవసాయరంగానిదే. అయితే సేవల రంగం, పారిశ్రామిక రంగాలను విస్మరించరాదు. అసం ఘటిత రంగంలోనూ బాల కార్మికులు పనిచేస్తున్నారు.
2001 జనాభా లెక్కల ప్రకారం మన దేశం మొత్తమ్మీద 5 నుంచి 14 ఏండ్ల లోపు వయసులో ఉన్న 1.26 కోట్ల మంది బాల బాలికలు ఆర్థిక కార్యకలాపాల్లో (బాలకార్మికులుగా) ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ప్రమాదకర వృత్తుల్లో పనిచేస్తున్నారు. 2004-05లో జాతీయ నమూనా సర్వే అంచనా ప్రకారం దేశంలో 89 లక్షల మంది బాల కార్మికులున్నారు. 2009-10లో 5-14 ఏళ్ల వయసున్న బాలకార్మికుల సంఖ్య 49.84 లక్షలు. యూనిసెఫ్ ప్రకారం దాదాపు సగం మంది, ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం సుమారు 43 శాతం మంది బాలబాలికలు ఎనిమిదో తరగతి లోపే బడిమానేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల్లో ఇది 55 శాతం, షెడ్యూల్డ్ తెగల్లో 63 శాతం దాకా ఉందని సమాచారం. బడి మానేసిన ప్రతి పిల్ల వాడూ అనివార్యంగా బాలకార్మికుడిగానే జీవిస్తు న్నాడని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
కొన్ని సంస్థల సర్వే ప్రకారం దేశంలో ఆరు కోట్ల మంది బాలకార్మికులు ఉన్నారు. అనధికారిక లెక్కలు చూస్తే పది కోట్ల మంది ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో మొత్తం బాలల జనాభాలో 14 శాత మంది వివిధ పను ల్లో చెమటోడ్చుతున్నారు. మొత్తం కార్మికుల్లో 4 శాతం మంది బాలలే. ప్రతీ పదిమంది బాలకార్మికుల్లో తొమ్మిది మంది వ్యవసాయ సంబంధిత పనుల్లో నిమగమవుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు శారీరక హింసకు గురవు తున్నారు. దాదాపు యాభై శాతం మంది ఏదో ఒక రూపంలో భౌతికంగా వేధింపులకు బాధితులవుతున్నారు.50 శాతం మంది వారమంతా ఎలాంటి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. అందులో కొంత మంది ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు.బాలకార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తారు కాబట్టి వారికి హక్కులు, కనీస వసతులు కూడా మృగ్యమే. తేలిగ్గా మోసానికి గురవడమే కాదు శ్రమదోపిడీకి గురవుతున్నారు. నిర్దిష్ట పని గంటలు లేవు. సెలవులు, బోనస్, పెన్షన్, గ్రాట్యూటీ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఏ సామాజిక భద్రతా చర్యలు వర్తించవు. వేతనాలు అతితక్కువ. పని పరిస్థి తులు భయంకరంగా ఉన్నాయి.
సూరత్‌లోని వజ్రాలు చెక్కుడు పరిశ్రమల్లో, శివకాశీలోని అగ్గిపెట్టెలు, బాణాసంచా తయారీ పరిశ్రమల్లోనూ, జైపూర్‌లోని రాళ్ల చెక్కుడు పనిలోనూ, ఫిరోజాబాద్ అద్దాల పరిశ్రమల్లోనూ, మురా దాబాద్‌లోని లోహ పరిశ్రమ ల్లోనూ, అలీఘర్‌లోని తాళాల పరిశ్రమల్లోనూ, మీర్జాపూర్ తివాచీల తయారీ శ్రమల్లోనూ, మార్కాపూర్‌లోని పలకల తయారీ పరిశ్రమలోనూ హీనమైన, హేయమైన వాతావరణంలో బాలకార్మికులు పనిచేస్తున్నారు. పరిశీలించి చూస్తే ఈ పరిశ్రమలన్నీ ప్రమాద భరిత పనులకు సంబంధించినవే. ఎంతోమంది పిల్లలు హోటళ్లలోనూ, దుకాణాలలోనూ, గృహాల్లోనూ సేవకులుగా పనిచేస్తున్నారు. వారి శక్తికి మించి అధిక గంటలు పని చేస్తూ అనేక అనారోగ్యాల భారిన పడుతున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేసే పిల్లలు పెద్ద పెద్ద బరువులు మోస్తుంటారు. తరచుగా గాయపడు తుంటారు. కొంత కాలానికి పూర్తిగా శక్తిని కోల్పోతారు. తివాచీ పరిశ్రమలో పనిచేసే బాలలు కంటి చూపును కోల్పోతున్నారు. శ్వాసకోస వ్యాధులతో ఇబ్బందులు పడేవారు అనేకం. కాశ్మీరులోని తివాచీల పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 60 శాతం మంది క్షయ, ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఫిరోజాబాద్‌లోని గ్లాస్, గాజుల పరిశ్రమలో పనిచేసే పిల్లలు అస్తమా, బ్రాంకైటిస్, కంటి సంబంధించిన రోగాలకు సతమతమవుతున్నారు. శివకాశీలో టపాకాయల పరిశ్రమలో పనిచేసే బాలలు రోగాలతో పాటు పేలుడులాంటి ప్రమాదాలకు బలైపోతున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే బాలలు ప్రమాదాలకు గురవుతున్నారు. భారీ యంత్రాలతో పనిచేసే వారు సరైన శిక్షణ, సరైన భద్రత లోపించడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.
బాల కార్మికులుగా చిన్నారులు మారడానికి కారణాలను పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల పేదరికమే ప్రధాన కారణం. పిల్లలు తమ మనుగడ కోసమే కాకుండా కుటుంబ అవసరాల కోసం పనిచేయాల్సిన దుస్థితి. పిల్లల్ని అదనపు ఆదాయం తెచ్చేవారిగా పేద కుటుంబాలు భావిస్తున్నాయి. ఎక్కువమంది తల్లితండ్రులు నిరక్ష్య రాస్యులు కావడం పిల్లల భవిషత్తు ప్రశార్థకంగా మారుతోంది. అర్థిక పరిస్థితి, అవగాహనాలోపం వల్ల ప్రాథమిక విద్యను కూడా అందించలేకపోతున్నారు. సాంఘిక ఆర్థిక స్థితిగతులు (కుటుంబ పరిమాణం, నిరుద్యోగిత మొదలైనవి) బాలకార్మిక వ్యవస్థ వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రధాన లోపంగా చెప్పవచ్చు.భారీ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల పల్లెల నుంచి పట్టణాలకు వలసెళ్లడం. గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి లేక పొట్టకూటి కోసం వలసెళ్లిన చోట పిల్లలను చదివించే పరిస్థితి ఉండదు. వారు కూడా బాలకార్మికులుగా మారడం అనివార్యమవుతున్నది. దీనికి తోడు ప్రస్తుత విద్యావిధానంపై అవగాహన కల్పించకపోవడం, పేద కుటుంబాలకు ఉపాధి కల్పించకపోవడం ప్రభు త్వాల ఘోర వైఫల్యం. అదే విధంగా పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరంగా చూడకపోవడం, ఇది సాధారణ విష యంగా ప్రస్తుత సమాజం భావించడం ఈ వ్యవస్థ బలోపేతం కావడానికి మరో కారణం. పలక, బలపం పట్టాల్సిన చేతులు పలుగు, పార పట్టడం అత్యంత శోచనీయం. దీనికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవడం, వారిని చక్కదిద్ది బడికి పంపడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. అంతేకాదు బాల కార్మికులు పనిచేసే ప్రతిచోటా పౌర సమాజం కూడా దీన్ని వ్యతిరేకించడం, అవసరమైన దగ్గర ఉద్యమించడం చేయాలి. అప్పుడే ఈ పరిస్థితి నుంచి కొంతైనా బయటపడగలం.భావి భారత పౌరుల ముఖాల్లో వెలుగుల్ని చూడగలం.
(నేడు ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ
వ్యతిరేక దినోత్సవం)
డా. చిటికెన కిరణ్ కుమార్
9490841284