– నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి కన్నుమూత
– పలువురి సంతాపం
నవతెలంగాణ-హిమాయత్ నగర్
పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య జీవిత భాగస్వామి, కవి, నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి(62) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా మల్టిపుల్ ఆర్గాన్ డిసార్డర్‌తో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని అపోలో హాస్పటల్‌కు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. కాగా, ఆయన అంత్యక్రియలు చిట్యాల సమీపంలోని నేరడ గ్రామంలో ఉన్న వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థి దశలో పీడీఎస్‌యూలో చురుకుగా పాల్గొన్న రామకృష్ణారెడ్డి అదే యూనియన్‌లో పనిచేస్తున్న ఉద్యమ సహచరురాలు వి.సంధ్యను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఈస్ట్ మారేడుపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన మొదటి బ్యాచ్ విద్యార్థులు. విద్యార్థి దశ నుంచి నేటి వరకు ప్రగతిశీల భావాల పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తూ విప్లవోద్యమాలకు సహకరిస్తూ అందరికీ ఆర్కేఆర్‌గా ఆయన సుపరిచితుల య్యారు. రెండేండ్ల క్రితం నవ్య ప్రింటింగ్ ప్రెస్‌లో విప్లవ సాహిత్యాన్ని ముద్రిస్తున్నారనే కారణంతో పోలీసులు ఆయన ప్రెస్ మీద దాడి చేసి సీజ్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
ప్రముఖుల సంతాపం
రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే హిమాయత్ నగర్‌లోని ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు తరలి వచ్చి ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. నివాళ్లర్పించిన వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వై.వెంకటేశ్వర్లు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మెన్ అల్లం నారాయణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, నాయకులు బొజ్జ బిక్షమయ్య, రాములు, బండారు రవికుమార్, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు ఎస్.వెంకటేశ్వరరావు, పి.సూర్యం, వేములపల్లి వెంకట రామయ్య, కె.గోవర్ధన్, కె.రమా, సీపీఐ నాయకులు పశ్య పద్మ, తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం.నరసయ్య, మహిళా నాయకులు జ్యోతి, పద్మకుమారి, రమా మేల్కోటే, సజయ, విమల, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్, జర్నలిస్ట్ కె.శ్రీనివాస్, మాభూమి సంధ్య, కవులు కళాకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామిక వాదులు ఉన్నారు.