ఉమ్మడి పౌరస్మృతి ఎవరి కోసం? : పీవోడబ్ల్యూ ప్రశ్న

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భిన్న జాతులు, మతాలతో కూడిన వైవిధ్యమైన దేశంలో మతోన్మాద వైషమ్యాలను సృష్టించే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఉమ్మడి పౌరస్మృతి ఎవరికోసమంటూ ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షులు జి ఝాన్సీ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మార్క్స్‌ భవన్‌లో ఆ సంఘం ఉపాధ్యక్షులు అనసూయ అధ్యక్షతన ‘కామన్‌ సివిల్‌ కోడ్‌ ఎవరి కోసం’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ భిన్న జాతులు, మతాల వైవిధ్య సంస్కృతులు కలిగిన దేశంలో ముందుగా వ్యక్తిగత చట్టాలలో సంస్కరణలు మొదలు పెట్టాలనీ, ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదన్న 21వ లా కమిషన్‌ సూచనలను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. ఒకే దేశం, ఒకే భాష ఒకే సంస్కృతి పేరుతో వైషమ్యాలను సృష్టించి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయడానికి చూస్తున్నారని విమర్శించారు. మహిళల సమానత్వం పేరుతో, మైనార్టీలను, ఇతర జాతులను అణిచి వేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సామాజిక కార్యకర్త సంధ్య మాట్లాడుతూ భిన్న జాతుల, మతాల సంస్కతుల సమాహారంగా ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదని తెలిపారు. భారత ప్రజాస్వామ్య లక్షణంగా, రాజ్యాంగబద్ధమైన హక్కు అని లా కమిషన్‌ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. సామాజిక కార్యకర్త సజయ ఈ ఉమ్మడి పౌరస్మృతి ఎలా ఉంటుందో డ్రాఫ్ట్‌ లేకుండానే ఒకే దేశం, ఒకే చట్టం అంటున్నారని తెలిపారు. ఉమ్మడి పౌర స్మృతికి మైనార్టీ మతస్థులు వ్యతిరేకం అన్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ, సీఎంఎస్‌ శ్రీదేవి, డీబీఎఫ్‌ నాయకులు కల్పన, సామాజిక కార్యకర్త అంబిక తదితరులు పాల్గొన్నారు.