పవర్‌ కట్‌!

పవర్‌ కట్‌!స్లో పిచ్‌. పరుగులు సులువుగా రావు. క్రీజులో నిలబడి చెమటోడ్చాలి. అప్పుడే మంచి స్కోరు సాధ్యం. ఇవేవీ టీమ్‌ ఇండియాకు తెలియనిది కాదు. ప్రపంచకప్‌లో తొలి పది మ్యాచుల్లో అమలు చేసిన వ్యూహమే ఫైనల్లోనూ అనుసరించారు. ఆరంభంలో రోహిత్‌ శర్మ దంచికొడ్తే.. ఆ తర్వాత ఆఖరు వరకు ఇన్నింగ్స్‌ బాధ్యత కోహ్లి చూసుకోవాలి. రోహిత్‌ శర్మ పవర్‌ప్లేలో దండయాత్ర చేశాడు. రోహిత్‌ దెబ్బకు తొలి పది ఓవర్లలో భారత్‌ 80 పరుగులు పిండుకుంది. కానీ ఆ తర్వాత ప్రణాళికే అనుకున్నట్టు సాగలేదు. ఐదు వికెట్లు చేతిలో ఉంచుకుని డెత్‌ ఓవర్లలోకి అడుగుపెట్టిన టీమ్‌ ఇండియా.. అక్కడా నిరాశపరిచింది. చివరి పది ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 43 పరుగులే చేసింది. ఇక 11-40 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులే చేసింది. తొలి పది ఓవర్లలో 80 పరుగులు సాధిస్తే.. ఆ తర్వాతి 40 ఓవర్లలో 180 పరుగులే వచ్చాయి. కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 97 బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా బాదకుండా అతి జాగ్రత్తతో కొంత నష్టం చేశారు!. ఆసీస్‌ మెరుపు ఫీల్డింగ్‌, ఒక్కో బ్యాటర్‌కు ప్రత్యేకించి ఫీల్డింగ్‌ మొహరింపులు సహా క్రమం తప్పకుండా బౌలింగ్‌లో మార్పులు కంగారూలకు బాగా పని చేశాయి. దీంతో పవర్‌ప్లే ముగియగానే టీమ్‌ ఇండియా ఆటలో పవర్‌ లేకుండా పోయింది.