నవతెలంగాణ-పాలకవీడు
మండలపరిధిలోని అలింగాపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని రైతాలు అష్టకష్టాలు పడుతున్నారు.అప్రకటిత విద్యుత్ కోతలు తమ ప్రాణం మీదికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలంగాపురం ఫీడర్ సుదీర్ఘకాలంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో బోరు బావులకు విద్యుత్ అందక నోటి కాడికి వచ్చిన పంటలు ఎండి పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల కింద కొందరు రైతులు పురుగుమందు డబ్బాలు చేత పట్టుకొని విద్యుత్ కేంద్రంలోకి ప్రవేశించి నిరసన తెలిపారు. తమకు ఇచ్చే విద్యుత్ లైన్‌పై అధికలోడు వేయడం వలన సమస్య వస్తుందని రైతులు చెబుతున్నారు.గురువారం మరోసారి కరెంట్ ఆపరేటర్‌తో వాగ్వివాదానికి దిగి అధికారులు రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ పంటలు నిలువునా ఎండిపోయి అపార నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.గతవారం అధికారులు వచ్చి తాత్కాలికంగా విద్యుత్ కోతలు లేకుండా చేసినా, తిరిగి మూడు రోజులకే పునరావతమైందని వాపోయారు. అధికారులు స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.