– అధ్యక్ష బరిలో బ్రిజ్‌భూషణ్ అనుచరుడు సంజరు సింగ్
– రెజ్లింగ్ కుటుంబం మద్దతుతో అనిత షియోరాన్
– 12న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అంతిమ దంగల్‌కు సిద్ధమవుతోంది. బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అనుచరుడు సంజరు సింగ్, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో కీలక సాక్షి, కామన్‌వెల్త్ క్రీడల మాజీ చాంపియన్ అనిత షియోరాన్‌లు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి రేసులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 12న డబ్ల్యూఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికలు జరుగనుండగా.. శనివారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి మహేశ్ మిట్టల్ కుమార్ సోమవారం ఎన్నికల్లో పోటీపడనున్న అభ్యర్థుల జాబితాను అధికారికంగా వెల్లడించనున్నారు.
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, అతడి కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ నిలువరించింది. కానీ రెజ్లింగ్ సమాఖ్యలో తిరుగులేని పట్టు సాధించిన బ్రిజ్ భూషణ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 15 స్థానాలకు తన అనుచరులను బరిలో నిలిపాడు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏకగ్రీవ అభ్యర్థులను ఖరారు చేస్తారనే ఊహాగానాలు వినిపించినా.. గత వారం రాష్ట్ర సంఘాలతో సమావేశమైన బ్రిజ్‌భూషణ్ సింగ్ ఎన్నికల బరిలో నిలిచేందుకే మొగ్గు చూపాడు. ఇక బ్రిజ్‌భూషణ్ హయాంలో సంయుక్త కార్యదర్శిగా పని చేసిన సంజరు సింగ్‌ను బ్రిజ్ భూషణ్ స్వయంగా అధ్యక్ష పదవి పోటీకి ఎంపిక చేశారు. మరోవైపు జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా సహా రెజ్లింగ్ కుటుంబం మద్దతుతో అనిత షియోరాన్ బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియటంతో అధ్యక్ష బరిలో సంజరు సింగ్, అనిత షియోరాన్‌లు మాత్రమే మిగిలారు.
ఏకపక్షమే..!
బ్రిజ్‌భూషణ్, అతడి కుటుంబ సభ్యులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించినా.. భారత రెజ్లింగ్ సమాఖ్య మరో నాలుగేండ్లు బిజెపి ఎంపీ కనుసన్నల్లోనే నడువనుంది. డబ్ల్యూఎఫ్‌ఐలో 25 అనుబంధ సంఘాలు ఉండగా.. ఎన్నికల ప్రక్రియలో 24 రాష్ట్ర సంఘాలు ఓటు హక్కు వినియోగించుకోనున్నాయి. ప్రతి రాష్ట్ర సంఘం నుంచి ఇద్దరికి ఓటు హక్కు ఉంటుంది. ఓటు వేయనున్న 24 రాష్ట్ర రెజ్లింగ్ సంఘాల్లో ఏకంగా 20 సంఘాలు బ్రిజ్‌భూషణ్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాయి. దీంతో అధ్యక్షుడు సహా 15 మందితో కూడిన ఎగ్జిక్యూటివ్ ప్యానల్‌కు బ్రిజ్ భూషణ్ అనుచరులే ఎన్నిక కానున్నారు!. ప్రధాన కార్యదర్శి పదవికి రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) కార్యదర్శి ప్రేమ్ చంద్‌తో బ్రిజ్‌భూషణ్ అనుచరుడు దర్శన్ లాల్ పోటీపడనున్నాడు. ఉత్తరాఖాండ్ రెజ్లింగ్ సంఘం కార్యదర్శి, బ్రిజ్‌భూషణ్ అత్యంత సన్నిహితుడు సత్యపాల్ సింగ్ దేశ్వాల్ కోశాధికారి పదవికి పోటీపడుతున్నాడు. ఇతడికి వెటరన్ స్పోర్ట్స్ ఆడ్మినిస్ట్రేటర్ దుశ్యంత్ శర్మ నుంచి పోటీ ఉంది. ఉపాధ్యక్ష పదవి రేసులో ఐడి నానావతి (గుజరాత్), దేవేంద్ర కడియన్ (హర్యానా) నిలిచారు.