పవర్‌హిట్టర్ల టైటిల్‌ వేట

Powerhitters title chase– నేడు ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ పోరు
– రెండో టైటిల్‌పై సన్‌రైజర్స్‌ గురి
– మూడో ట్రోఫీ కోసం కోల్‌కత తహతహ
– రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
2021లో పదో స్థానం, 2022లో ఎనిమిదో స్థానం, 2023లో మళ్లీ పదో స్థానం. ఐపీఎల్‌ గత సీజన్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రదర్శన ఇది. వేలంలో పాట్‌ కమిన్స్‌కు రికార్డు ధర పెట్టడంతో సన్‌రైజర్స్‌ కథ మళ్లీ కంచికే అనేశారు.
గత రెండు సీజన్లలో కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. జట్టులో స్వదేశీ స్టార్స్‌ పెద్దగా లేరు. 2015 నుంచీ లీగ్‌లో ఆడని మిచెల్‌ స్టార్క్‌కు రికార్డు ధర పెట్టి కొనుగోలు చేశారని విమర్శలు తప్పలేదు. సరైన సారథ్యం, సరైన కూర్పు లేని జట్టుగా ముద్ర!. హైదరాబాబాద్‌, కోల్‌కత ఐపీఎల్‌ 17 ఫైనల్లో తలపడతాయని ఎవరూ ఊహించలేదు.
టీ20 క్రికెట్‌లో సరికొత్త బ్రాండ్‌ క్రికెట్‌తో ఇటు హైదరాబాద్‌, అటు కోల్‌కత ఐపీఎల్‌లోనే కాదు గ్లోబల్‌ టీ20 క్రికెట్‌ అభిమానులను సైతం ఆకట్టుకున్నాయి. భయమెరుగుని బ్యాటింగ్‌తో అసాధ్యమనుకున్న రికార్డులు అలవోకగా బద్దలుకొట్టాయి. పవర్‌ హిట్టింగ్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చాయి.
2012, 2014లో కోల్‌కత ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఇటీవల సీజన్లలో దారుణ వైఫల్యాలు చవిచూసినా.. బ్యాటింగ్‌ విధ్వంసక విప్లవంతో నేడు మరో ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో నిలిచాయి. నేడు చెపాక్‌లో సన్‌రైజర్స్‌ రెండో టైటిల్‌ అందుకుంటుందా? కోల్‌కత మూడో ట్రోఫీ ముద్దాడుతుందా? ఆసక్తికరం.
నవతెలంగాణ-చెన్నై
ఐపీఎల్‌ 2024 ఆఖరు ఆటకు చేరుకుంది. రెండు నెలల పాటు సరికొత్త విధ్వంసక క్రికెట్‌తో లీగ్‌ను ఊపేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ నేడు ఐపీఎల్‌ 17వ సీజన్‌ టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాయి. మే 26న చెపాక్‌ స్టేడియంలో ఫైనల్లో తలపడే జట్లుగా హైదరాబాద్‌, కోల్‌కతలపై ఎవరికీ అంచనాలు లేవు. కానీ, ఆధునిక క్రికెట్‌లో విప్లవాత్మక విధ్వంసక వ్యూహంతో అదరగొట్టిన సన్‌రైజర్స్‌, నైట్‌రైడర్స్‌ నేడు ఫైనల్‌ షోకు రంగం సిద్ధం చేసుకున్నాయి. పవర్‌ హిట్టింగ్‌ పవర్‌హౌస్‌లు నేడు ఆఖరు ఆటలో టైటిల్‌ కోసం తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్‌ రెండు సార్లు పంజా విసిరింది. లీగ్‌ దశలో, క్వాలిఫయర్‌ 1లో హైదరాబాద్‌ తలొంచింది. ఆ రెండు పరాజయాలకు నేడు టైటిల్‌ విజయంతో ప్రతీకారం తీర్చుకునేందుకు కమిన్స్‌ సేన ఎదురుచూస్తుంది. నేడు ఐపీఎల్‌ ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఢకొీట్టనున్నాయి.
దూకుడు మంత్ర : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎవరూ ఊహించని వ్యూహంతో విజయవంతమైంది. బలమైన బౌలర్ల జట్టుగా పేరొందిన సన్‌రైజర్స్‌.. ఈ సీజన్లో బ్యాటింగ్‌ పవర్‌హౌస్‌గా మారింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌ తరఫున ఏ బౌలర్‌ పెద్దగా వార్తల్లో నిలువలేదు. ఆ స్థాయిలో బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. నేడు ఫైనల్లో ఎర్ర మట్టి పిచ్‌, కోల్‌కత బ్యాటింగ్‌ లైనప్‌లో నలుగురు లెఫ్ట్‌ హ్యాండర్లతో సన్‌రైజర్స్‌ జట్టు కూర్పులో మార్పులు ఉండే అవకాశం ఉంది. వెంకటేశ్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌, రింకూ సింగ్‌, నితీశ్‌ రానాలకు చెక్‌ పెట్టేందుకు ఇద్దరు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లతో ఆడేది అనుమానమే. ట్రావిశ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా దంచికొడుతున్నారు. రాహుల్‌ త్రిపాఠి ఆఖర్లో ఈ జోడీకి జత కలిశాడు. కానీ మిడిల్‌ ఆర్డర్‌లో నమ్మకమైక బ్యాటర్లు కరువయ్యారు. ఎడెన్‌ మార్‌క్రామ్‌ క్వాలిఫయర్‌ 1లో తేలిపోయాడు. నేడు కోల్‌కతతో మ్యాచ్‌లో బలమైన మిడిల్‌ ఆర్డర్‌ సన్‌రైజర్స్‌కు అవశ్యం. గ్లెన్‌ ఫిలిప్స్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం సైతం లేకపోలేదు. 17 వికెట్లతో మెరిసినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన పాట్‌ కమిన్స్‌ నుంచి రాలేదు. కీలక మ్యాచుల్లో మెప్పించే పాట్‌ కమిన్స్‌ నేడు తనదైన పేస్‌ పంజా విసిరే అవకాశం లేకపోలేదు.
రైడర్స్‌ దీమా : కోల్‌కత నైట్‌రైడర్స్‌ శిబిరం ఎంతో నమ్మకంగా కనిపిస్తుంది. వర్షంతో శనివారం ప్రాక్టీస్‌ లేకపోయినా ఫైనల్లో ఆ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపించే అవకాశం లేదు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో ఆ జట్టు జోరుమీదుంది. సునీల్‌ నరైన్‌, గుర్బాజ్‌ సహా వెంకటేశ్‌ అయ్యర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌లో ఉన్నారు. నితీశ్‌ రానా, రింకూ సింగ్‌, రసెల్‌లు డెత్‌ ఓవర్ల ఊచకోతకు ఎప్పుడూ సిద్ధమే. మిచెల్‌ స్టార్క్‌ ఫామ్‌ కోల్‌కతకు అదనపు బలం. సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి మరోసారి మిడిల్‌ ఓవర్లలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఇద్దరు ఎనిమిది ఓవర్లలో సన్‌రైజర్స్‌ను పరుగుల వేటలో కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫిల్‌ సాల్ట్‌ బాధ్యతలను తీసుకుని కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ క్వాలిఫయర్‌ 1లో దూకుడుగా ఆడాడు. నేడు ఫైనల్లోనూ శ్రేయస్‌ అదే జోరు చూపించాలని భావిస్తున్నాడు.
పిచ్‌ రిపోర్టు : ఐపీఎల్‌ ఫైనల్‌కు చెపాక్‌లో ఎర్ర మట్టితో చేసిన పిచ్‌ను సిద్ధం చేశారు. దీంతో బ్యాటర్లకు కాస్త ఉపశమనం కలుగనుంది. స్పిన్నర్లతో పాటు పేసర్లకు సైతం పిచ్‌ నుంచి సహకారం లభించనుంది. మంచు ప్రభావం ఉంటుందని భావించినా.. ఏ మేరకు అని చెప్పటం కష్టమే. టాస్‌ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు.