‘తలసేమియా భాదితుల కోసం ఈ నెల 15న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసాం. ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా భాదితులకు అందిస్తాం. ప్రేక్షకులు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు’ అని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అద్వర్యంలో ఈనెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో నారా భువనేశ్వరి మాట్లాడుతూ,’జెనిటిక్ డిజార్డర్ తలసేమియాతో చాలా మంది పిల్లలు, పెద్దలు బాధపడుతున్నారు. ఇది తీవ్రంగా వచ్చినప్పుడు రక్త మార్పిడి వెంటనే జరగాలి. దీనికి చాలా రక్తం అవసరం. బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంది జీవితాలు నిలబడతాయి. ఆ బాధితుల కోసం తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్‌కి వస్తా అన్నారు. అంతేకాదు ఈ షోని ఫ్రీగా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారు. బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులో ఉంటాయి’ అని తెలిపారు. ‘తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఇటువంటి షోని నిర్వహించడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. చాలా మంచి ఆలోచనతో మొదలైన కార్యక్రమం ఇది. ప్రేక్షకులు టికెట్‌పై పెట్టే ప్రతి రూపాయి తలసేమియా బాధితుల సహాయార్థం వెళ్తుంది’ అని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు.