– దాదాపు రూ.577.88 కోట్ల నష్టం 768.47 కిలోమీటర్ల మేర ధ్వంసం
– 518 రోడ్లు, బ్రిడ్జీలు నాశనం ఎన్నికల నేపథ్యంలో సర్కార్‌కు సవాల్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు సర్కారుకు సవాల్ విసురుతున్నాయి. వెన్నులో చలిపుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా కుండపోత వానలు పడుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ రోడ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కల్వర్టు బ్రిడ్జీలు కూలిపోవడం, రోడ్లు తెగిపోవడం, పాక్షికంగా దెబ్బతినడంతో తదితరాల కారణంగా రవాణా మార్గాలు మూసు కుపోయాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు పంచాయతీ రాజ్ శాఖకు వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో 518 రోడ్లు దారుణంగా దెబ్బతిన్నట్టు అధికారిక సమాచారం. తద్వారా మొత్తం 768.47 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, రూ.577.88 కోట్ల మేరకు నష్టం జరిగింది. మళ్లీ ఈమేరకు నిధులను వెచ్చిస్తే తప్ప రోడ్లను పునరుద్దరించలేని పరిస్థితి ఏర్పడింది. సెంటీమీటర్ల స్థాయిలో వర్షం కురుస్తున్న కారణంగా రోడ్లు పూర్తిస్థాయిలో దెబ్బతినడం ప్రజా రవాణా వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ నష్టం శనివారం నాటికి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల అంచనా. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో 152 రోడ్లు దెబ్బ తిన్నాయి. ఆతర్వాత వరంగల్‌లో 98, రంగారెడ్డిలో 80, నల్లగొండలో 76 రోడ్లు, కల్వర్టు బ్రిడ్జీలు కూలిపోవడం, తెగి పోవడం జరిగిందని సమాచారం. వరుసగా మరో రెండురోజులు ఇలాగే వానలు కురిస్తే రాష్ట్రంలోని పీఆర్ రవాణా వ్యవస్థ స్థం బించిపోయే ప్రమాదముందని తెలిసింది. నష్టం అపారంగా పెరిగే అవకా శాలు లేకపోలేదని అధికారులు అభిప్రాయప డుతు న్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో దెబ్బ తిన్న రోడ్లు, కల్వర్టు బిడ్జ్రీల వివరాలను సేకరించే పనిలో పంచా యతీరాజ్ శాఖ నిమగమైంది. వరద నేపథ్యంలో కొన్ని గుర్తిం చడానికి కూడా వీలు కాకుండా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
యుద్ధప్రాతిపదికన పనులు
పంచాయతీరాజ్ రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం అన్నీ జిల్లాల్లోరవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో స్థంబించకుండా ఉండేందుకు తాత్కాలిక ప్రాతిపదిక పనులు చేస్తున్నారు. ఇక్కడ, అక్కడ అని కాకుండా అన్ని జిల్లాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి.
ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో 518 రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో తాత్కాలికంగా ప్రాతిపదికన మరమ్మతు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ కోతపడ్డ రోడ్లను మూసివేసి రిపేర్లు చేస్తున్నారు.
మరింత నష్టం జరిగే అవకాశం
గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా దాదాపు 768.47 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.29.82 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.
శాశ్వత ప్రాతిపదికన చేయాలటే రూ.305.65 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. అలాగే కల్వర్టు బిడ్జ్రీలు సుమారు 391 కూలిపోవడం, పాక్షికంగా దెబ్బతినడం జరిగాయి. వీటికి తాత్కాలికంగా 8.67 కోట్లు, శాశ్వతంగా రూ.192.28 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇకపోతే పూర్తిస్థాయిలో రోడ్లు తెగిపోయినవి 117 వరకు ఉన్నాయి. వీటిని పునరుద్ధరించడానికి రూ.41.46 కోట్లు అవసరమని అధికార యంత్రాంగం భావిస్తున్నది.
ఎన్నికలతో సవాలే
రానున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీ వర్షాలు పడి చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో ఉట్టిపడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంతోషంగా ఉండగా, అదే సందర్భంగా అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యంగా భావించే రోడ్లు తాజా వర్షాల నేపథ్యంలో అస్తవ్యస్థంగా తయారయ్యాయి. ఇది ఒకింత ఆందోళన కలిగించే అంశం. వెంటనే రోడ్లను పునరుద్దరించాలంటే యంత్రాంగం వెంటనే కదిలి చేయకపోతే సర్కారుకు నష్టమేననే వ్యాఖ్యానాలు వస్తున్నాయి