ప్రాక్టీస్‌ మొదలైంది

ప్రాక్టీస్‌ మొదలైంది– సాధనలో చెమటోడ్చిన రోహిత్‌, శ్రేయస్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులకు టీమ్‌ ఇండియా కఠోరంగా సన్నద్ధమవుతోంది. ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న టీమ్‌ ఇండియా.. ఉప్పల్‌ స్టేడియంలో సోమవారం ప్రాక్టీస్‌ సెషన్లో చెమటోడ్చింది. ఉదయం 9.30 గంటలకు భారీ బందోబస్తు నడుమ స్టేడియంకు చేరుకున్న రోహిత్‌సేన.. మూడు గంటల పాటు సాధన చేసింది. ప్రాక్టీస్‌ సెషన్‌కు ముందు 20 నిమిషాలు రోహిత్‌, ద్రవిడ్‌ చర్చించుకున్నారు. అనంతరం కోచ్‌ ద్రవిడ్‌ పిచ్‌ను పరిశీలించారు. విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా మినహా అందరూ ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరయ్యారు. యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు పూర్తి స్థాయిలో నెట్స్‌లో బ్యాటింగ్‌ సాధన చేశారు. భారత బౌలర్లు నెట్స్‌లో ప్రణాళిక బద్దంగా బౌలింగ్‌ చేశారు. బుమ్రా, సిరాజ్‌, ముకేశ్‌, అవేశ్‌ సహా కుల్దీప్‌ యాదవ్‌ నెట్స్‌లో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లకు బంతులు సంధించారు. తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చిన ధ్రువ్‌ జురెల్‌.. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌ సైతం చేశాడు. మధ్యాహ్నం సెషన్లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సాధన చేశారు.