ప్రాక్టీస్‌ పిచ్‌లు 14

Practice pitches 14– సరికొత్త ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు
– ప్రపంచకప్‌కు ఉప్పల్‌ స్టేడియం ముస్తాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్‌కు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం (ఉప్పల్‌) ముస్తాబవుతోంది. రెండు వార్మప్‌ మ్యాచులు, మూడు ప్రధాన మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్న ఉప్పల్‌ స్టేడియం.. అభిమానులకు, ప్రపంచ క్రికెట్‌ ప్రియులకు సరికొత్త అనుభూతి అందించేందుకు ఏర్పాట్లలో ఎక్కడా తగ్గటం లేదు. స్టేడియంలో కొత్తగా ఎల్‌ఈడీ ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేయగా.. ప్రాక్టీస్‌ పిచ్‌లకు సైతం ఆధునాతన ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు అమర్చారు. ఉప్పల్‌ స్టేడియం ఆవరణలో రెండు ప్రాక్టీస్‌ గ్రౌండ్‌లు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఒక్క గ్రౌండ్‌కు మాత్రమే ఫ్లడ్‌లైట్ల వెలుతురు ఉండేది. ప్రపంచకప్‌ నేపథ్యంలో రెండు ప్రాక్టీస్‌ గ్రౌండ్లకు సైతం ఫ్లడ్‌లైట్ల సదుపాయం కల్పించారు. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియాలు హైదరాబాద్‌లో ప్రపంచకప్‌ మ్యాచులు ఆడనుండగా.. ఐసీసీ ప్రమాణాల మేరకు అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో అక్టోబర్‌ 9, 10న వరుస మ్యాచులు షెడ్యూల్‌ చేశారు. ఏక కాలంలో నాలుగు జట్లు ప్రాక్టీస్‌ చేసేందుకు వీలుగా ఏకంగా 14 ప్రాక్టీస్‌ పిచ్‌లను సిద్ధం చేశారు. ‘ప్రపంచకప్‌ ఏర్పాట్ల పరంగా హెచ్‌సీఏ ముందుంది. హైదరాబాద్‌కు రానున్న జట్ల షెడ్యూల్‌, ప్రాక్టీస్‌, వసతి, ప్రయాణం సహా అన్ని అంశాలపై ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. సెప్టెంబర్‌ 29న జరగాల్సిన వార్మప్‌ మ్యాచ్‌కు అభిమానులను అనుమతించటం లేదు. మిగతా మ్యాచుల నిర్వహణకు పోలీసుల నుంచి పూర్తి సహకారం ఉంది. ఇటు పోలీసులు, అటు బీసీసీఐతో నిత్యం టచ్‌లో ఉన్నాం. ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియాంలో నూతన ఫ్లడ్‌లైట్లు, సీటింగ్‌, ప్రాక్టీస్‌ పిచ్‌లు సిద్ధం చేశాయి. ఏర్పాట్ల పరంగా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాం. ప్రపంచకప్‌లో ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఉప్పల్‌ స్టేడియం సరికొత్తగా కనిపించనుంది. ప్రపంచకప్‌ అనుభూతిని అభిమానులు ఆస్వాదించేలా ముందుకెళ్తున్నామని’ హెచ్‌సీఏ సీఈవో సునీల్‌ తెలిపారు.
ప్రపంచకప్‌ ట్రోఫీ సందడి : హైదరాబాద్‌లో ప్రపంచకప్‌ ట్రోఫీ సందడి చేసింది. రెండు రోజులుగా నగరంలో ఐసీసీ వరల్డ్‌కప్‌ ట్రోఫీ టూర్‌ సాగుతుండగా, గురువారం చారిత్రక చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌ సహా ఉప్పల్‌ స్టేడియంలో ట్రోఫీని ప్రదర్శించారు. ప్రపంచకప్‌ ట్రోఫీతో అభిమానులు, ఔత్సాహికులు సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు.