ప్రమాదాన్ని తప్పించుకున్న ప్రజ్ఞాన్‌

Pragyan escaped the accident– బిలాన్ని తప్పించుకొని వేరే మార్గంలో ప్రయాణం
బెంగళూరు : చందమామపై పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌కు పెను ప్రమాదం తప్పింది. రోవర్‌ ప్రయాణిస్తున్న మార్గంలో నాలుగు మీటర్ల వ్యాసం కలిగిన బిలం ఎదురైంది. అయితే అందులో పడే ముప్పు నుంచి రోవర్‌ తప్పించుకోగలిగింది. కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి బిలాన్ని తప్పించుకొని సరైన మార్గంలో పయనిస్తోంది. దీనికి సంబంధించిన చిత్రాలను ఇస్రో ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. మూడు మీటర్ల దూరంలో బిలం ఉన్నదని గమనించిన ప్రజ్ఞాన్‌ వెంటనే తన మార్గాన్ని మార్చుకుంది. రోవర్‌లోని నావిగేషన్‌ కెమారా దీనికి సంబంధించి రెండు ఫొటోలు తీసింది. మొదటి ఫొటోలో బిలం కన్పించగా, రెండో ఫొటోలో రోవర్‌ పయనించిన కొత్త మార్గం కన్పిస్తోంది. ఇదిలావుండగా సూర్యునిపై ప్రయోగాల కోసం సెప్టెంబర్‌ 2వ తేదీన ‘ఆదిత్య ఎల్‌1’ను ప్రయోగించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది.