ప్రహారీ కూలిపోయి..ధాన్యం బస్తాలకు రక్షణ కరువై..

– మండల కేంద్రంలోని రైస్ మిల్ వద్ద దుస్థితి
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వార ప్రజలకు బియ్యమందజేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి కాలంలో కొనుగోలు కేంద్రాలేర్పాటు చేసి రైతుల వద్ద నుండి వరిధాన్యం కొనుగోళ్లు చేసి అయా రైస్ మిల్లులకు కేటాయించి తరలించింది.కేటాయించిన వరిధాన్యానికి మిల్లర్లు రక్షణ కల్పించడంలో అలసత్వం వహిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.బుధవారం కురిసిన తెలికపాటి వర్షానికి మండల కేంద్రంలోని రైస్ మిల్ ప్రహారీ కూలిపోయి..మిల్ కు ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యం బస్తాలు చెల్లాచెదురుగా పడిపోయిన దుస్థితి నెలకొంది.దీంతో రైస్ మిల్ నిర్వహాకులపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వేల కోట్ల నిధులు కేటాయించి రైతుల నుండి కొనుగోలు చేసిన వరిధాన్యానికి రక్షణ కరువైందని పలువురు వాపోతున్నారు. మిల్లులకు కేటాయించిన వరిధాన్యాన్ని మిల్ యాజమానుల ఇష్టానుసారానికి వదిలేస్తూ సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయకుండా వాటి వైపు కనీసం కన్నెత్తి చూడడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.మిల్లుల్లో నిల్వ చేసిన వరిధాన్యంపై సంబధిత అధికారులు ఇప్పటికైన పర్యవేక్షణ చేయాలని ప్రజలు కొరుతున్నారు.